నారాయణఖేడ్: మండల కేంద్రమైన నిజాంపేటలోని ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం స్కూల్‌గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఖేడ్ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు సంబంధించి అండర్– 19 విభాగంలో విద్యార్థులు ఫయీం, శివ, అమన్, అయాన్, భూమేశ్ బంగారు పతకాలు, రేహాన్ వెండి పతకం సాధించారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా కళాశాలల ఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి గణపతి, కుస్తీ కోచ్ జైపాల్, పీడీ విఠల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు రాములు, వ్యాయామ ఉపాధ్యాయులు అజీజ్, సంతోష్, సిబ్బంది అభినందించారు.
ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని నవాబుపేట గ్రామంలో సోమవారం ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ విచారణ చేపట్టారు. ఈనెల 18న గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో గొడవ చోటు చేసుకుంది. కులం పేరుతో దూషించారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ విచారణ చేపట్టి వివరాలు సేకరించారు. విచారణ అనంతరం తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మధుకర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
కల్లు దుకాణాలపై
ఎకై ్సజ్ దాడులు
పెద్దశంకరంపేట(మెదక్): కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్ సీఐ గోపాల్ హెచ్చరించారు. సోమవారం పెద్దశంకరంపేట, కమలాపూర్, ఉత్తులూర్, శివాయపల్లి, కోళాపల్లి తదితర గ్రామాల్లోని కల్లు దుకాణాలపై ఎకై ్సజ్ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ఆయా దుకాణాల్లో కల్లు షాంపిల్స్‌ను పోలీసులు సేకరించారు. వీటిని పరిశీలన నిమిత్తం నిజామాబాద్ కార్యాలయానికి పంపించనున్నట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట ఎకై ్సజ్ ఎస్‌ఐ వినోద్, సిబ్బంది ఉన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
సిద్దిపేటరూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సీతారాంపల్లి గ్రామానికి చెందిన పోచంపల్లి ప్రత్యూష, స్వామి శుక్రవారం ఇంటికి తాళం వేసి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ రెండు రోజులు ఉండి తిరిగి ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. దీంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న తులం బంగారు గొలుసు, 7 గ్రాముల ఉంగరాలు, 10తులాల వెండి కడియాలు కనిపించలేదు. అపహరణకు గురైన ఆభరణాల విలువ సుమారు రూ.లక్షకు పైగా ఉంటుందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అదే గ్రామంలో మరో ముగ్గురి ఇంట్లో సైతం దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు.


