● వచ్చే సీజన్‌లో వరి సాగు వద్దు ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కోహెడరూరల్(హుస్నాబాద్): రైతులు దళారులు , ప్రైవేట్ వ్యాపారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతుల సౌకర్యార్థం నియోజకవర్గంలో 136 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోపే నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఈసారి సన్న వడ్లకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తుందని చెప్పారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ముగింపు దశకు వచ్చాయని , భూసేకరణకు రైతులు సహాకరిస్తే 2027నాటికి సాగునీరు అందిస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భూగర్భ జలాలు పడిపోవడం, విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున యాసంగి సీజన్‌లో రైతులు వరి వేయవద్దని సూచించారు. కురిసిన ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకించేలా ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ పాయింట్లను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి పొదుపులో జిల్లాలోనే అక్కన్నపేట మండలం మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల, మండల అధ్యక్షుడు సుధాకర్, ధర్మయ్య, డీఆర్డీఏ పీడీ జయదేవ్‌ఆర్యా తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్‌కు పరామర్శ..
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ వైద్యం కిరణ్‌ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.


