పటాన్‌చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలికను పోలీసులు గుర్తించారు. శనివారం గుర్తుతెలియని వ్యక్తి 112కు ఫోన్‌చేసి, ఇస్నాపూర్ చౌరస్తాలో బాలిక ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకొని, నాగయ్య కుమార్తె సోనీ(8)గా గుర్తించారు. ఆమె స్వస్థలం అల్లాదుర్గం మండలం కాగా, ప్రస్తుతం సంగారెడ్డిలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక సంక్షేమం, సంరక్షణ దృష్ట్యా మహిళా పోలీసు సిబ్బంది సంగారెడ్డిలోని బాలసదనానికి తరలించారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించాలి
తూప్రాన్: ఈ నెల 31 నుంచి 2 వరకు నిర్మల్‌లో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్ బాల్ చాంపియన్షిప్‌లో జిల్లా జట్టు విజయం సాధించాలని జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ శర్మ పేర్కొన్నారు. స్థానిక తెలంగాణ క్రీడా ప్రాంగణంలో జరిగిన మెదక్ జిల్లా బాలికల ఎంపిక ప్రక్రియలో జిల్లా నుంచి సుమారు 30 మంది బాలికలు పాల్గొన్నారని తెలిపారు. ఇందులో సుమారు 20 మందిని శిక్షణ శిబిరానికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి జరిగే శిక్షణ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16 మంది క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు. కార్యక్రమంలో జిల్లా కోచ్‌లు అంతర్జాతీయ క్రీడాకారులు రవి, సుమన్, స్థానిక నాయకులు కుమార్ గౌడ్, భిక్షపతి సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా 230వ నగర సంకీర్తన
జహీరాబాద్ టౌన్: ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమాన్ మందిరం వీధిలో 230వ నగర సంకీర్తన భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. భక్తుల హరినామస్మరణ, నృత్యాలతో హనుమాన్ మందిర ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా కంది అక్షయపాత్ర బాధ్యులు విభీషణ్ ప్రభూజీ భగద్గీతలోని 3వ అధ్యాయం 9వ శ్లోకం గురించి వివరించారు. అనంతరం భక్తులకు అల్పాహారం వితరణ చేశారు. నేటి నుంచి ప్రతి రోజు సాయంత్రం హనుమాన్ మందిరంలో దామోదర మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
చిట్టీ డబ్బు ఇవ్వలేదని ఫిర్యాదు
బషీరాబాద్: చిట్టీ పాట పాడిన తర్వాత సొమ్ము చెల్లించకుండా దుర్భాషలాడుతూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ మంథట్టి గ్రామానికి చెందిన విభూతి పరమేశ్వర్ (30) ఆదివారం బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన సంకు మహిపాల్ వద్ద పరమేశ్వర్ రూ.5.10 లక్షల చిట్టీ వేశారు. సెప్టెంబరు 15న పాట పాడి రూ.4.84 లక్షలకు డిక్లేర్ చేసుకున్నారు. అయితే సొమ్ము చెల్లించకుండా నిర్వాహకుడు తిప్పుతున్నాడని బాధితుడు ఆరోపించారు. అక్టోబరు 16న డబ్బుల కోసం వెళ్లగా.. ఇవ్వనని దూషిస్తూ ఇంటి నుంచి గెంటేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే తరహాలో మరికొందరు చిట్టీ సభ్యులను మోసం చేసినట్లు, మహిపాల్‌పై ఇప్పటికే ధారూరు పీఎస్‌లోనూ కేసు నమోదైనట్లు తెలిపారు.


