దుబ్బాక: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో నీటమునిగి హమాలి కార్మికుడు మృతి చెందాడు. ఎస్‌ఐ కీర్తిరాజు కథనం ప్రకారం.. దుబ్బాక పట్టణంలోని డబుల్‌బెడ్రూం కాలనీలో నివాసం ఉంటున్న బెల్లె భూమయ్య(52) హమాలి కార్మికుడిగా పనిచేస్తూ భార్య , ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం బోడోనికుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. గట్టుమీద చెప్పులు, బట్టలు పెట్టి చేపలు పట్టేందుకు కుంటలోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో భూమయ్య భార్య, బంధువులు కుంటవద్ద గాలించగా గట్టుమీద చెప్పులు, బట్టలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం కుంటలో పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించగా భూమయ్య మృతదేహం బయటపడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పాము కాటుతో మహిళా రైతు..
అల్లాదుర్గం(మెదక్): పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా పాము కాటుకు గురై మహిళా రైతు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని రాంపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి నిర్మల(53), పద్మారావు దంపతులు. వీరికి నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వరి పంటను సాగు చేస్తున్నారు. నిర్మల పొలం వద్దకు వెళ్లి పశువులను మేపి అక్కడే కట్టేసింది. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో పాము కాటుకు గురైంది. పొలం నుంచి ఇంటికి వచ్చే వరకు ఆలస్యం కావడం, అక్కడి నుంచి జోగిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆమె మృతి చెందింది.


