బాలిక తల్లిదండ్రులకు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

బాలిక తల్లిదండ్రులకు అప్పగింత

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల్లో తప్పిపోయిన మూడేళ్ల చిన్నారిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ కథనం ప్రకారం.. మంబోజిపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌, రేణుక దంపతుల కుమార్తె సుదీక్షిత ఏడుపాయల్లోని ఆలయ పరిసరాల్లో తప్పిపోయింది. ఏడుస్తూ కనిపించిన ఆ బాలికను విధి నిర్వహణలో ఉన్న స్వరూపరాణి, భవాని అనే మహిళా కానిస్టేబుళ్లు గమనించి అక్కున చేర్చుకున్నారు. కొద్ది సేపటికి అమ్మాయి తల్లిదండ్రులు, పాప కోసం ఈఓ కార్యాలయానికి రాగా, వారికి సుదీక్షితను అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ.. జాతరలు, పుణ్యక్షేత్రాలకు వచ్చినపుడు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా కానిస్టేబుళ్ల పని తీరును ఎస్పీ ప్రశంసించారు.

బిల్లులు రాక..

ఆగిన ట్యాంకు నిర్మాణం

తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు

హుస్నాబాద్‌రూరల్‌: మండలంలోని కూచనపెల్లి గ్రామంలో తాగునీటి సరఫరాకు రూ.22 లక్షల వ్యయంతో ఓహెచ్‌ఆర్‌ వాటర్‌ ట్యాంకు నిర్మిస్తున్నారు. పనులు చేసినా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్‌ పనులు మధ్యలోనే నిలిపి వేయడంతో తెనుగుపల్లె కాలనీకి తాగునీరు అందడం లేదని ఆదివారం గ్రామస్తులు ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన భూ నిర్వాసితులు కొన్ని కుటుంబాలు కూచనపెల్లి శివారులో భూములు కొనుగోలు చేసి, ఇంటి నిర్మాణం చేసుకొని ఉంటున్నారు. ఈ కాలనీకి తాగునీరు సరఫరా చేయడానికి పైపులైన్‌, ఓహెచ్‌ఆర్‌ వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి ప్రభుత్వం రూ.22 లక్షల నిధులు మంజూరు చేసింది. 2024 నవంబర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి రెండేళ్లు పూర్తి కావస్తున్నా.. ట్యాంక్‌ ప్రజలకు ఉపయోగంలోకి రాకపోవడంతో కాలనీ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వాటర్‌ ట్యాంకు పనులు పూర్తి చేసి తాగునీరు అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ రుహనాను వివరణ కోరగా.. కాంట్రాక్ట్‌రుకు బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేశారన్నారు. కాలనీ ప్రజలకు వాటర్‌ ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement