నక్క వాగులోకి పరిశ్రమల కాలుష్య జలాలు
● పట్టించుకోని అధికారులు ● మృత్యువాత పడుతున్న మూగ జీవాలు
హత్నూర(సంగారెడ్డి): పరిశ్రమలు గుట్టుచప్పుడు కాకుండా కాలుష్య జలాలను వదులుతున్నాయి. దీంతో నక్క వాగు కాలుష్య కారకంగా మారింది. హత్నూర మండలం గుండ్లమాచునూర్, పల్పనూరు శివారులోని నక్క వాగు కాలుష్య జలాలు మంజీరా నీటిలో కలిసి కలుషితమవుతున్నాయి. ఇక్కడి నుంచి మంజీరా నీరు బోర్పట్ల, రెడ్డి ఖానాపూర్, కాసాల, నవాబుపేట, పన్యాల, కొన్యాల, చీక్ మద్దూర్, లింగాపూర్, సిరిపుర గ్రామాల శివారుల గుండా ప్రవహిస్తుంది. ఈ గ్రామాల పరిధిలో ఇటీవల పెద్ద ఎత్తున చేపలు మత్యువాత పడ్డాయి. మూగజీవాలు కాలుష్య జలాలు తాగి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. కాలుష్య జలాలతోనే పంటలు పండించడం వల్ల రైతులు సైతం రోగాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలు గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నక్కవాగులో కాలుష్య జలాలు


