నారాయణఖేడ్: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ ఉమాహారతి అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కల్హేర్, నిజాంపేట్, సిర్గాపూర్, మండలాలకు చెందిన ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఈసీల తో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్నినో నేపథ్యంలో కూలీలు పనులు లేక ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. ఉపాధి పనులు కేవలం కూలీలకు పని కల్పించే కార్యక్రమం కాకుండా గ్రామాల్లో శాశ్వత ఆస్తులు, నీటివనరుల అభివృద్ధి చేసే కార్యక్రమంలా అమలు చేయాలని ఆదేశించారు. వర్క్ ఫ్రమ్ విలేజ్ స్ఫూర్తితో పనిచేయాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిత్యం పంచాయతీలో 100 నుంచి 150 మంది వరకు కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతరం కూలీలకు పనులు కల్పించేలా ముందుగానే పనులను గుర్తించి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత, ప్రతీ పొలానికి పంట కుంట అనే లక్ష్యంతో పనులు ఉండాలని తెలిపారు. సమావేశంలో అదనపు డీఆర్డీఓ బాల్రాజ్, అధికారులు పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ ఉమాహారతి


