దుబ్బాకటౌన్: దొంగతనం జరగకపోయినా తప్పుడు ఫిర్యాదు ఇచ్చి, పోలీసులను తప్పుదోవ పట్టించడమే కాకుండా వారి విలువైన సమయాన్ని వృథా చేసిన మహిళపై కేసు నమోదైంది. దుబ్బాక ఎస్‌ఐ కీర్తి రాజు శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఇటీవల పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన పంజా రాజమణి , కుటుంబ కలహాలు, ఇతర గొడవల కారణంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను వ్యవసాయ పొలంలో పని చేసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి తన ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడును చోరీ చేశారని సదరు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పూర్తిస్థాయిలో లోతుగా విచారణ చేశారు. విచారణలో అక్కడ ఎలాంటి చోరీ జరగలేదని, కుటుంబ వివాదాల నేపథ్యంలోనే ఆమె అబద్ధపు ఫిర్యాదు చేసిందని నిర్ధారణ అయింది. తప్పుడు ఫిర్యాదు ద్వారా పోలీసులను తప్పుదోవ పట్టించి, వారి సమయాన్ని వృథా చేసినందుకు పంజా రాజమణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


