పటాన్‌చెరు: భారత రక్షణ రంగంలో త్రివిధ దళాల సమన్వయం, ప్రభుత్వానికి సమగ్ర సైనిక సలహాలు అందించడం, సాయుధ దళాల సామర్థ్యాన్ని పెంపొందించడంలో చీఫ్ ఆఫ్ డిఫెనన్స్ స్టాఫ్ (సీడీఎస్) కీలకపాత్ర పోషిస్తున్నారని భారత్ శక్తి గ్రూపు వ్యవస్థాపకుడు నితిన్ ఎ.గోఖలే అన్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో శుక్రవారం నిర్వహించిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘రేపటి యుద్ధాలకు సన్నద్ధం: త్రివిధ దళాల నుంచి ఒకే పోరాట శక్తిగా’ అనే అంశంపై ప్రసంగిస్తూ, రక్షణ రంగ ఆధునికీకరణ, స్వదేశీకరణ, సమీకృత థియేటర్ కమాండ్ల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో కె.ఎస్.పి.పి.డీన్, మాజీ దౌత్యవేత్త సయ్యద్ అక్బరుద్దీన్ పాల్గొన్నారు.


