గుర్తు తెలియని వ్యక్తి..
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన తెల్లాపూర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. కొల్లూరు పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 55ఏళ్ల వయస్సు గల వ్యక్తి తెల్లాపూర్ పరిధిలోని ఎలియన్స్ చౌరస్తా సమీపంలో సాయంత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో తెల్లాపూర్ నుంచి ఉస్మాన్‌నగర్ వైపు వెళ్తున్న రెడీమిక్స్ ప్లాంట్‌కు చెందిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
బొలెరో ఢీకొని..
ములుగు(గజ్వేల్): బొలెరో ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కథనం ప్రకారం.. అన్నసాగర్ గ్రామానికి చెందిన కీసరి నర్సింలు(50)వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 22న కుటుంబ సభ్యులతో కలిసి బహిలంపూర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లాడు. అదే రోజు రాత్రి తన యాక్టీవాపై తిరిగి ఇంటికి బయలు దేరాడు. గోల్డ్‌స్టోన్ పాఠశాల సమీపంలో ఎదురుగా వచ్చిన బొలెరో అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నర్సింలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు వాహన డ్రైవర్ ఎండి అప్జల్‌పై కేసు నమోదు చేశారు.
మరో చోట యువకుడు..
హవేళిఘణాపూర్(మెదక్): ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన కలాలి సాయిచరణ్‌గౌడ్(27) పెయింటర్ పని కోసం నిత్యంలాగే గురువారం మెదక్ పట్టణానికి వచ్చాడు. అదే రోజు రాత్రి అదే గ్రామానికి చెందిన ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా శాలిపేట గేటు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో సాయిచరణ్‌గౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అర్ధరాత్రి మృతి చెందాడు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు వివరాలు ఇలా..
ఇర్కోడ్ వద్ద ఇద్దరు..
నారాయణఖేడ్: కర్ణాటక రాష్ట్రం బసవ కళ్యాణ్ సమీపంలోని ఇర్కోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మనూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్, పీఎసీఎస్ డైరెక్టర్ సంగమణి (55), ఈమె భర్త రేషన్ డీలర్ సంజీవులు (56)తోపాటు కుటుంబ సభ్యులు ఐదుగురు కారులో మనూరు నుంచి తుల్జాపూర్ ఆలయానికి బయలుదేరారు. శుక్రవారం అర్ధరాత్రి బసవ కళ్యాణ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కోడలు మమత, కుమారుడు సురేశ్, మనువడు తీవ్ర గాయాల పాలయ్యారు.


