హవేళిఘణాపూర్(మెదక్): మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ మండలం కోంటూర్ చెరువు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. చిన్నశంకరంపేట మండలానికి చెందిన నర్సింలు(40) అత్తగారింటికి మెదక్ మండలం వెంకటాపూర్‌కు 20వ తేదీన వచ్చాడు. దీంతో 22న భార్య లక్ష్మితో తనకు మద్యం తాగేందుకు డబ్బులు కావాలని గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కాగా శుక్రవారం ఉదయం కోంటూర్ చెరువుకట్టపై ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు కుటుంబీకులకు సమాచారం అందించారు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న నర్సింలు నిత్యం భార్యతో గొడవపడుతుండేవాడని కుటుంబీకులు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మెదక్‌రూరల్ ఎస్‌ఐ సుమన్ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో..
చేర్యాల(సిద్దిపేట): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని దానంపల్లిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంతపురి మల్లయ్య(45) వ్యవసాయ పనులు, కూతురు పెళ్లి కోసం అప్పు చేశాడు. అప్పులు తీర్చే దారి లేక తనకున్న పొలం కొంత అమ్మేశాడు. అప్పులు తీరకపోవడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ భారం పెరగడం, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరగడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
చికిత్స పొందుతూ ఇద్దరు..
శివ్వంపేట(నర్సాపూర్): వేర్వేరు ఘటనల్లో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దొంతి గ్రామానికి చెందిన నాగరాజు(35) మద్యానికి బానిసై ఈ నెల 19న ఇంట్లో ఆత్మహత్యకు యత్నించగా గుర్తించిన కుటుంబ సభ్యులు కొన ఊపిరితో ఉన్న అతడ్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో చిన్నగొట్టిముక్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య(60) మిషన్ భగీరథలో వాటర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి శివ్వంపేటలో విధులు ముగించుకుని సైకిల్‌పై గ్రామానికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. సూరారం మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య నర్సమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య


