తగ్గిన దిగుబడులు
అధిక దిగుబడులు పొందాలనే ఉద్దేశంతో రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, సరైన దిగుబడులు రాక నష్టాలను చవిచూడటం, ఉన్న పంటలను తీసుకుందామంటే కూలీల కొరత సమస్యగా మారింది. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధిక రేట్లు ఇచ్చి ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. –న్యాల్‌కల్(జహీరాబాద్)
జిల్లాలో ఈ ఏడాది 3,52,246 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసుకున్నారు. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఐదేళ్ల క్రితం ఎకరాకు 8 నుంచి 13 క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి రాగా వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుతం పంట దిగబడులు ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆగస్టు రెండవ వారం వరకు పంటలు ఆశాజనకంగా ఉన్నప్పటీకీ ఆ తర్వాత వర్షాల జాడ లేకపోవడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో సరైన పంట దిగుబడులు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాలు ధర రూ.8,667లుగా ప్రభుత్వం నిర్ణయించింది. సీసీఐ కేంద్రాల ద్వారా ఈ ధరకు పత్తిని కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ ధర రూ.9వేలకుపైగా పలుకుతోంది. ధర ఆశాజనకంగా ఉన్నా దిగుబడులు తగ్గుతుండటంతో తాము నష్టపోవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు బాగా ఉన్నా పొలంలోని పంటను తీసేందుకు కూలీలు దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి కూలీలు
ప్రస్తుతం చేతికి వచ్చిన పంటను ఇళ్లకు తెచ్చుకుందామంటే కూలీల సమస్య రైతులను ఇబ్బందుల పాలు చేస్తుంది. కూలీల కోసం రైతులు అధిక డబ్బులు వెచ్చించి మైబూబ్‌నగర్, రంగారెడ్డి, దేవరకొండ, కర్నూల్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి ఆటోలు, ఇతర వాహనాలను ద్వారా తెప్పిస్తున్నారు. పంట దిగుబడులు అంతంతమాత్రంగానే ఉండటంతో కూలీలు పత్తి తీసేందుకు అధిక డబ్బులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో చేసేది లేక కిలో పత్తి తీసేందుకు రూ.13 చెల్లిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కూలీలను ఇతర ప్రాంతాల నుంచి రప్పించేందుకు అయ్యే రవాణా ఖర్చులు కూడా రైతులే భరించాల్సివస్తుంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలకు వారానికి ఒకసారి దావత్ కూడా ఇవ్వాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొలంలోంచి పత్తి (కిలో) తీసేందుకు రవాణా ఇతర ఖర్చులు కలిపి రూ.15 వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తిని తీసేందుకు కూలీలు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికి అందుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.
పెట్టుబడులు కూడా రాని పరిస్థితి
మరోవైపు వేధిస్తోన్న కూలీల కొరత
ఇతర ప్రాంతాల నుంచి తేవడంలో రైతులు నిమగ్నం


