కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి జోన్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లాలో నిర్వహించనున్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ ఐఐ), కంప్యూటర్ ఆధారిత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 24న జరిగే అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–ఐఐ),పరీక్షకు సంబంధించి గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎస్పీ పరితోశ్ పంకజ్‌తో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రుద్రారం గ్రామంలోని గీతం వర్సిటీలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మొత్తం 150మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష రెండు సెషన్లలో ఉంటుందని, మొదటి సెషన్ ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్షల నిర్వహణ సాఫీగా ప్రశాంతంగా జరగడానికి తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ పరితోశ్ పంకజ్ వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, మహిళ శిశు వికలాంగుల శాఖ అధికారులు, ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్, పటాన్‌చెరు తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఓటు హక్కు
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–2026) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి ‘ఎస్‌ఐఆర్–2026’ప్రక్రియ పురోగతిపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు జాబితాకు సంబంధించి అందే ప్రతీ క్లెయిమ్, అభ్యంతరాన్ని నిర్దేశిత ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. నవంబర్ 5 లోగా ప్రక్రియను పూర్తి చేసి, నవంబర్ 9న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


