సంగారెడ్డి జోన్: అణగారిన, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పండుగ సాయన్న కనబరిచిన ధైర్యసాహసాలు, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఖేడ్ సబ్‌కలెక్టర్, ఇన్‌చార్జి డీఆర్‌డీఓ ఉమాహారతి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమాహారతి పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...సామాజిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచి పోరాటం సాగించిన ఆయన ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆనాటి భూస్వాములు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా పండుగ సాయన్న వీరోచితంగా పోరాడారని కొనియాడారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయనకు ఎస్పీ పరితోశ్ పంకజ్ ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ప్రజల కోసం నిలబడిన ధైర్యశాలిగా, అన్యాయాన్ని ఎదిరించి బలహీన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తిగా పండుగ సాయన్న గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన జీవితం ధైర్యం, పోరాట పటిమ, ప్రజల పట్ల బాధ్యతకు ప్రతీక అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహనీయుల సేవలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు చేరుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్‌ఐ సురేశ్ నాయక్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ ఉమాహారతి


