కాలుష్యంలో మరో ఢిల్లీ | - | Sakshi
Sakshi News home page

కాలుష్యంలో మరో ఢిల్లీ

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

సంగారెడ్డిలో పెరుగుతున్న వాయుకాలుష్యం

ఈ డేటాను పట్టించుకోని పీసీబీ

● దేశ రాజధాని ఏక్యూఐ 170.. సంగారెడ్డి ఏక్యూఐ 166

● రెడ్‌ కేటగిరీ పరిశ్రమల కాలుష్యంతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి

● పరిమితిలోపే గాలి నాణ్యత ఉందంటున్న పీసీబీ అధికారులు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వాయు కాలుష్యంలో జిల్లాలో కోరలు చాస్తోంది. ఈ కాలుష్య తీవ్రత విషయంలో సంగారెడ్డి దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతోంది. దేశంలోనే అత్యధికంగా వాయు కాలుష్యం ఉండే ఢిల్లీలో గురువారం గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ – ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) 170గా ఉంది. సంగారెడ్డిలో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇదే గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) అత్యధికంగా 166గా రికార్డు అయింది. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో వాయు కాలుష్య తీవ్రతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఏక్యూఐ 50 వరకు ఉంటే గుడ్‌ (మంచి వాతావరణం) ఉన్నట్లు గుర్తిస్తారు. 50 నుంచి 100 వరకు మోడరేట్‌ ( మధ్యస్తంగా) ఉన్నట్లు లెక్కిస్తారు. ఏక్యూఐ 100 నుంచి 150 మద్యలో ఉంటే గాలి నాణ్యత పూర్‌గా (నాణ్యత లేని గాలి)గా పేర్కొంటారు. 150 నుంచి 200 వరకు ఏక్యూఐ ఉంటే అనారోగ్య గాలిగా పరిగణిస్తారు. ఈ గాలిని పీల్చుకుంటే దీర్ఘకాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సంగారెడ్డిలో ఏక్యూఐ 166గా రికార్డు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏక్యూఐ మరింత పడిపోతే ఇంట్లో కూడా ఎయిర్‌ ప్యూరిఫైయిర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రెడ్‌ కేటగిరీ పరిశ్రమల విధ్వంసం

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాలో ఎక్కువగా రెడ్‌ కేటగిరీ పరిశ్రమలున్నాయి. ప్రధానంగా ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం జిల్లా వాసులను పడరాని పాట్లకు గురిచేస్తున్నాయి. రసాయన పరిశ్రమలు, బల్క్‌డ్రగ్‌, సాల్వేంట్‌ రికవరీ, కెమికల్‌ రికవరీ, పైరాలసిస్‌ పరిశ్రమలతో కూడా పెద్ద ఎత్తున వాయు కాలుష్యం అవుతోంది. ఈ పరిశ్రమల చుట్టుపక్కల కాలనీలు, గ్రామాలతోపాటు, దూరంగా ఉన్న ప్రాంతాలకు కూడా వస్తున్న ఘాటైన వాసనలు విస్తరిస్తున్నాయి.

జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి

గాలి కాలుష్యంతో జిల్లా వాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పలుచోట్ల ఘాటైన వాసనలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డితో పాటు, పటాన్‌చెరు, హత్నూర, కంది, అమీన్‌పూర్‌ తదితర చోట్ల కాలుష్య తీవ్రత అధికంగా ఉంటోంది. ప్రధానంగా రాత్రయితే చాలు ఈ ఘాటు వాసనల తీవ్రత మరింత పెరుగుతోంది. ఒక్కోసారి ఊపిరి ఆడటం కూడా కష్టమవుతుందని జిల్లా వాసులు పేర్కొంటున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాలో వాయు కాలుష్య నియంత్రణను గాలికి వదిలేస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఊపిరితిత్తులకు హానిచేసే వాయువులు గాలిలో కలిసి పోతుండటంతో దీర్ఘకాలికంగా అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. చలి షురూవైంది. ఈ క్రమంలోనే కాలుష్య తీవ్రం కావడంతో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ఏక్యూఐ వెబ్‌సైట్‌ డేటాను తాము పరిగణనలోకి తీసుకోబోమని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు. తాము ఏర్పాటు చేసిన యాంబియంట్‌ ఎయిర్‌క్వాలిటీ స్టేషన్లలో నమోదైన డేటానే పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఈ స్టేషన్లు జిల్లాలో ఐదు చోట్ల ఉన్నాయి. ఐఐటీహెచ్‌, ఇక్రిశాట్‌, పాశమైలారం ఇండస్ట్రియల్‌ పార్కు, గడ్డపోతారం ఇండస్ట్రియల్‌ పార్కు, సింఫనీపార్కుల్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement