పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధి బూర్గుపల్లిలో గేదె దొంగతనం విషయంపై గ్రామపెద్దలు నిర్వహించిన పంచాయతీ ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమయింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని సంగమేశ్వర్ (31), అదే గ్రామానికి చెందిన కోటప్పకు చెందిన గేదెను మంగళవారం రాత్రి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. బుధవారం గ్రామంలో ఈ దొంగతనం విషయంపై పంచాయతీ నిర్వహించారు. సంగమేశ్వర్‌కు రూ. 50 వేల జరిమానా కట్టాలని గ్రామస్తులు తీర్పునిచ్చారు. దీంతో పోలీసు కేసు అవుతుందనే భయంతో.. జరిమానా చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో మనస్తాపానికి గురైన సంగమేశ్వర్.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న బోయిని దత్తు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై ఎస్‌ఐ ప్రవీణ్ రెడ్డి విచారణ చేపట్టి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య


