నిరీక్షణకే రెండేళ్లు! | - | Sakshi
Sakshi News home page

నిరీక్షణకే రెండేళ్లు!

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

పలు స్టేషన్లకు మేలు

వికారాబాద్‌–పర్లీ డబుల్‌ రైల్వేలైన్‌కు ఇంకెన్నాళ్లు?

జహీరాబాద్‌: వికారాబాద్‌–పర్లీ రైల్వే స్టేషన్ల మధ్య జహీరాబాద్‌ మీదుగా రైల్వే శాఖ డబుల్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి ప్రతిపాదించింది. ప్రాథమిక సర్వే చేసి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ డబుల్‌ లైన్‌ నిర్మాణం విషయంలో అతీ గతీ లేకుండా పోయింది. వికాబాద్‌ నుంచి మహారాష్ట్ర రాష్ట్రంలోని పర్లీ వరకు సుమారు 270 కిలోమీటర్ల మేర డుబల్‌ లైన్‌ వేసేందుకు దక్షిణ మధ్య రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. పనులు చేపట్టేందుకు ప్రతిపాదించినా అది ప్రతిపాదనలకే పరిమితం అయింది. ప్రతిపాదించి రెండేళ్లవుతున్నా డబుల్‌ లైన్‌ నిర్మాణం విషయంలో రైల్వే శాఖ ప్రత్యేక శ్రధ్ద చూపక పోవడంతో ఈ అంశం మరుగున పడింది. కొత్తగా వేసే రైల్వే లైన్‌ను పాత రైల్వే లైన్‌ పక్క నుంచి వేసి, కొత్తగా బ్రిడ్జిలు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సైతం చేసింది. రైల్వే బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయించేలా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా ప్రత్యేక చొరవ తీసుకోక పోవడం వల్లే ప్రతిపాదనలు ముందుకు సాగలేని పరిస్థితి నెలకొందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

డబుల్‌ లైన్‌ ఏర్పాటుతో సౌకర్యం

డబుల్‌ రైల్వే లైన్‌ నిర్మించడం వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం సింగిల్‌ లైన్‌ ఉండటంతో ఎదురుగా ఇరు వైపుల నుంచి వచ్చే రైళ్లకు దారి ఇచ్చేందుకు వీలుగా ముందు స్టేషన్లలో ఒక రైలును నిలిపివేయాల్సి వస్తోంది. ఒక్కో సారి అర గంట పాటు స్టేషన్‌లో రైళ్లు నిలిచే పరిస్థితి ఏర్పడుతోంది. రైళ్లు ఆలస్యం అయ్యేందుకు ఇదే కారణంగా పలువురు పేర్కొంటున్నారు. డబుల్‌ లైన్‌ నిర్మాణం జరిగితే రైళ్ల రాక పోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు.

నిత్యం 30 రైళ్లు రాకపోకలు

జహీరాబాద్‌ మీదుగా ప్రతి నిత్యం 30 రైళ్ల వరకు రాక పోకలు సాగిస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు గూడ్స్‌ రైళ్లు నిత్యం వెళ్తుండటంతో ప్రతి రైలుకు దారి ఇచ్చేందుకు మరో రైలును ముందు స్టేషన్‌లో నిలపాల్సి వస్తోంది. భవిష్యత్తులో మరిన్ని రైళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే డబుల్‌ రైల్వే లైన్‌ నిర్మించాల్సిన అవశ్యకత ఉంది. ఈ మార్గంలో ఇప్పటికే విద్యుత్‌ సౌకర్యంతో రైళ్లు నడుస్తున్నాయి. డబుల్‌ లైన్‌ నిర్మాణం విషయంలో రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

డబుల్‌ లైన్‌ నిర్మాణం వల్ల పలు రైల్వే స్టేషన్ల పరిధిలోని వారికి మేలు కలగ నుంది. ముఖ్యంగా వికారాబాద్‌, గేటు వనంపల్లి, మర్పల్లి, కోహీర్‌, జహీరాబాద్‌, మెటల్‌కుంట, బీదర్‌, బాల్కి, కమల్‌నగర్‌, ఉద్గీర్‌, లాతూర్‌రోడ్డు, పర్లీ వైజ్యనాథ్‌ స్టేషన్‌లకు మేలు కలుగనుంది.

270 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదన

ప్రతిపాదించి రెండేళ్లవుతున్నా సర్వేకు నోచుకోని వైనం

రెండో లైన్‌ ఏర్పాటు కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement