యువతి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

మిస్సింగ్‌ కేసు నమోదు

వర్గల్‌(గజ్వేల్‌): ఇంటి అవసరాలకు వస్తువులు కొనేందుకు వెళ్తున్నట్లు చెప్పి యువతి అదృశ్యమైంది. ఈ ఘటన వర్గల్‌ మండలం తున్కిమక్త సమీప స్పిన్నింగ్‌ మిల్లులో చోటుచేసుకుంది. గౌరారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన కై రి అశ్విత(19) సిద్దిపేట జిల్లా తున్కిమక్త సమీప స్పిన్నింగ్‌మిల్లులో పనిచేస్తోంది. ఈ నెల 20న ఇంటికి అవసరమైన వస్తువులు కొనేందుకు వెళ్తున్నట్లు చెప్పి కంపెనీ నుంచి బయటకు వచ్చింది. ఆ తరువాత కుమార్తె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో గురువారం ఆమె తల్లి గంగాజల గౌరారం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బంగారు గొలుసు అప్పగింత

జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం డివిజన్‌లోని వైఎస్సార్‌ కాలనీలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో పోగొట్టుకున్న తులం బంగారు గొలుసును పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. ఈ నెల 20న జరిగిన శోభాయాత్రలో ఓ యువకుడి మెడలో నుంచి తులం బంగారు గొలుసు తెగిపడిపోయింది. ఎంత వెతికినా దొరకకపోవడంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి గొలుసును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఆ బంగారు గొలుసును బాధిత యువకుడికి అప్పగించారు. ఈ మేరకు సీఐ సుధీర్‌కు బాధితుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

వంట విషయమై గొడవ: అత్త ఆత్మహత్య

పెద్దశంకరంపేట(మెదక్‌): వంట విషయంలో ఆత్తాకోడళ్ల మధ్య తలెత్తిన గొడవ అత్త ఆత్మహత్యకు దారితీసింది. ఈ సంఘటన పెద్దశంకరంపేట మండలం కోళాపల్లిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పులబోయిన శంకరమ్మ(72), తన కోడలు సావిత్రితో వంట విషయంలో గొడవపడి మనస్తాపానికి గురై గ్రామ శివారులోని కోళాపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వాట్సాప్‌ లింక్‌తో సైబర్‌ మోసం

రూ.83 వేలు పోగొట్టుకున్న వ్యక్తి

టేక్మాల్‌(మెదక్‌): సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.83 వేలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన టేక్మాల్‌ మండలంలోని కాద్లూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. కాద్లూర్‌ గ్రామానికి చెందిన బక్క సాయిలు బంధువుల ఫోన్‌కు పెళ్లి లేదా ఇతర వేడుకల ఇన్విటేషన్‌ పేరుతో వాట్సాప్‌లో ఒక లింక్‌ వచ్చింది. ఆ లింక్‌ వారి ఫోన్‌లో ఓపెన్‌ కాకపోవడంతో సాయిలు నంబర్‌కు ఫార్వర్డ్‌ చేశారు. ఈ నెల 20న సాయంత్రం సాయిలు వాట్సాప్‌లో ఆ లింక్‌ను ఓపెన్‌ చేయగానే, తన ఖాతా నుంచి రూ. 83 వేలు కట్‌ అయినట్లు మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. గురువారం ఆయన స్థానిక యూనియన్‌ బ్యాంక్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోగా, ఆ డబ్బులు లాల్‌లాల్‌ జుగల్‌ కిషోర్‌ జువెల్లర్స్‌ ఖాతాకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో బాధితుడు సైబర్‌ క్రైమ్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ కు ఫోన్‌ చేసి, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పటాన్‌చెరు టౌన్‌: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పటాన్‌చెరు ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ పక్కన ఓ ఏటీఎం వద్ద దాదాపు 55 ఏళ్ల వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement