నర్సాపూర్ రూరల్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్నచింతకుంట గ్రామానికి చెందిన కంచం భిక్షపతి (32), కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా అతని భార్య కంచం శేఖమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. మంగళవారం సాయంత్రం ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన భిక్షపతి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన భార్య చూసి పక్కింటి వారి సాయంతో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో..
కౌడిపల్లి(నర్సాపూర్): అప్పులబాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని బూరుగడ్డ గ్రామంలో గురువారం వెలుగుచూసింది. ఎస్సై అమరేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాటి శంకరయ్య (55)కు భార్య భారతమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెల వివాహాలు, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక కొంతకాలంగా ఆందోళన చెందుతున్నాడు. గ్రామంలో ఉపాధి లేకపోవడంతో కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని చింతల్‌కు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించిన శంకరయ్య, గురువారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


