హవేళిఘణాపూర్(మెదక్): ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన మండల పరిధిలోని పోచమ్మరాళ్ తండాలో గురువారం వెలుగుచూసింది. తండాకు చెందిన గూగ్లోత్ విఠల్ బుధవారం ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లాడు. అదే రోజు రాత్రి దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కృష్ణయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బంగారం, వెండి ఆభరణాలు మాయం


