● కలెక్టర్ పత్రీక్‌జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్
● సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళి
సంగారెడ్డి జోన్, సంగారెడ్డి క్రైమ్: ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు పోలీస్ అమరవీరులు సిర్గాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎల్లయ్య, జిన్నారం పోలీస్ స్టేషన్‌కు చెందిన సత్యనారాయణ, కంగ్టి పోలీస్ స్టేషన్‌కు చెందిన సురేశ్ చేసిన సేవలు, త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పదిమంది పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతీ ఏటా అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఎంతోమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. 2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 154మంది పోలీసు సిబ్బందిని స్మరించుకోవడం మనందరి బాధ్యతన్నారు.
ఘనంగా కార్యక్రమాలు
ఈ నెల 21 నుంచి అక్టోబర్ 31న నిర్వహించే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం వరకు ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల రక్షణకు ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి అని పిలుపునిచ్చారు.


