జనగణనకు ప్లానింగ్‌! | - | Sakshi
Sakshi News home page

జనగణనకు ప్లానింగ్‌!

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జనగణనలో మరో కీలక ప్రక్రియ షురూవైంది. ఇప్పటికే ఇండ్ల గణన (హౌజ్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌)ను విజయవంతంగా పూర్తి కాగా..2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న జనగణనకు ముందస్తు ప్రణాళిక రూపకల్పన ప్రారంభమైంది. జనగణన కోసం ప్రతీ 800 మంది జనాభాకు ఒక బ్లాకుగా గుర్తిస్తున్నారు. జనగణన చేసే ఎన్యూమరేటర్లకు భారం కాకుండా ఒక్కో ఎన్యూమరేటర్‌కు 800 మంది జనాభా వివరాలు సేకరించేలా ఈ ప్రణాళికను తయారు చేస్తున్నారు. ఇండ్ల గణన చేసినప్పుడు వచ్చిన గణాంకాల ఆధారంగా ఈ బ్లాకులను గుర్తిస్తున్నారు. ఈ బాధ్యతలు చార్జ్‌క్లర్క్‌లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు అప్పగించారు. రెవెన్యూశాఖకు చెందిన ఆర్‌ఐలు, డీటీలు, సీనియర్‌ అసిస్టెంట్లు చార్జ్‌క్లర్కులుగా వ్యవహరిస్తారు. అలాగే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు, ఆ స్థాయి అధికారులు చార్జ్‌క్లర్కులుగా పనిచేస్తారు. వీరికి టెక్నికల్‌ అసిస్టెంట్ల సహాయంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఈ బ్లాకులను గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియపై చార్జ్‌క్లర్కులకు, టీఏలకు ఇటీవల శిక్షణ కూడా ఇచ్చారు. రాష్ట్ర సెన్సెస్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ భారతీహోలికేరి ఇటీవల జిల్లాకు వచ్చి ఈ ప్రక్రియపై కీలక సమావేశం నిర్వహించారు.

జిల్లాలో 37 చార్జ్‌లు..

జిల్లాలో మొత్తం 37 చార్జ్‌లున్నాయి. జనగణన ప్రక్రియలో ఒక మండలాన్ని రూరల్‌ చార్జ్‌గా పిలుస్తారు. మున్సిపాలిటీని అర్బన్‌ చార్జ్‌గా పేర్కొంటారు. జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉండగా 26 రూరల్‌ మండలాలున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అమీన్‌పూర్‌ మండలంలో జనగణన బాధ్యతలను సీఎంసీ (సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌)కు అప్పగించారు. రూరల్‌ మండలంగా ఉన్న జిన్నారం మున్సిపాలిటీగా కావడంతో అర్బన్‌ చార్జ్‌గా గుర్తించారు. కాగా ఇండ్లగణన సందర్భంగా జిల్లాను మొత్తం 2,480 బ్లాకులుగా గుర్తించిన విషయం విదితమే. అయితే ఇప్పుడు జనగణన ప్రక్రియ వచ్చేసరికి ఈ బ్లాకుల సంఖ్యలో మార్పులు ఉండనున్నాయని అధికారులు తెలిపారు.

బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌ బాధ్యతలు జిల్లాకే..

సీఎంసీ పరిధిలో ఉన్న బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌ జనగణన బాధ్యతలను జిల్లా అధికారులకే అప్పగించారు. ఈ నోటిఫైడ్‌ ఏరియాలో జిల్లా అధికారులే జనగణన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లాస్థాయి అధికారులకు శిక్షణ

జనగణన అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రక్రియ కావడంతో జిల్లా అధికారులకు కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులతోపాటు, తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ఈ నెల 26, 27 తేదీల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రతీ 800 మంది జనాభాకు ఒక ఎన్యూమరేషన్‌ బ్లాక్‌

గుర్తింపు బాధ్యతలు చార్జ్‌ క్లర్కులు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు!

26 నుంచి అధికారులకు అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement