దుకాణం వెనుక వైపు గోడకు రంధ్రం చేసి అపహరణ
జోగిపేట(అందోల్): దుకాణం వెనుక వైపు భాగంలో గోడకు పెద్ద రంధ్రం చేసి 40 నూకల బస్తాలను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. జోగిపేటలోని వ్యాపారి బచ్చు ఆనంద్ ఎప్పటిలాగే షాపు తెరిచి వ్యాపారం చేసుకొని రాత్రి 8 గంటల ప్రాంతంలో మూసేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం షాపును శుభ్రం చేసి, దసరా కావడంతో పూజ చేద్దామని షాపు తెరిచే సరికి ఎదురుగా పెద్ద రంధ్రం ఏర్పడడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. వెంటనే వెనక వైపు వెళ్లి ముళ్ల పొదల్లో అన్ని చోట్ల పరిశీలించాడు. అనంతరం జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గతంలో కూడా ఇలాగే రంధ్రం తవ్వి దొంగతనానికి పాల్పడడంతో కాంక్రీట్‌తో 7 ఫీట్ల ఎత్తు వరకు గోడ నిర్మాణం చేశానని, ప్రస్తుతం 9 ఫీట్ల ఎత్తులో రంధ్రం చేశారని బాధితుడు ఎస్‌ఐకి వివరించారు. ఈ ఘటనపై దగ్గరలోని సీసీ ఫుటేజీలను పరిశీలించి దొంగలను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.


