చేగుంట(తూప్రాన్): రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ రగ్బీ పోటీలకు జిల్లా నుంచి 24 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్ గణేశ్ రవికుమార్ తెలిపారు. బుధవారం చేగుంటలో అండర్ –19 ఎస్‌జీఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి రగ్బీ పోటీలను నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 56 మంది క్రీడాకారులు పాల్గొనగా ప్రతిభ కనబర్చిన 12 మంది బాలికలు, 12మంది బాలురిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరంతా ఈనెల 23 నుంచి రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల ఆర్గనైజింగ్ కార్యదర్శులు నాగరాజు, సమ్మయ్య, గణపతి పాల్గొన్నారు.
ఇంట్లో అగ్ని ప్రమాదం
– తప్పిన ముప్పు
సంగారెడ్డి టౌన్: పండుగ వేళ ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని నాగాపూర్ గ్రామంలో బేగరి రమేశ్ ఇంట్లో ఈ నెల 21న అర్ధరాత్రి షార్టుసర్కూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే ఫర్నిచర్ తదితర వస్తువులు కాలిపోయాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
డప్పు కొట్టేందుకు వచ్చి..
వ్యక్తి అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: అంత్యక్రియల్లో డప్పు కొట్టేందుకు వచ్చిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బాలానగర్‌కు చెందిన డప్పు జంగయ్య(33) ఈ నెల 20న పటాన్‌చెరు మండలం భానూర్ గ్రామంలో బ్యాగరి సామయ్య అంత్యక్రియలకు హాజరయ్యాడు. కార్యక్రమం అనంతరం దసరా చందాలు వసూలు చేసి, బోడ ప్రశాంత్, పక్కిరి సోనుతో కలిసి మద్యం తాగారు. అదే రోజు రాత్రి 9.30 గంటల సమయంలో ప్రశాంత్ జంగయ్యను పటాన్‌చెరు వెళ్లే బస్సు ఎక్కించాడు. అయితే ఆయన ఇంటికి పోలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు.
బాలికపై
సామూహిక లైంగికదాడి
మద్దూరు(హుస్నాబాద్): బాలికపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన దూల్మిట్ట మండలంలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఓ గ్రామానికి చెందిన బాలికను మంగళవారం రాత్రి 9గంటలకు పొరుగు గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు బైక్‌లపై వచ్చి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. తిరిగి బాలికను బుధవారం తెల్లవారు జామున 4గంటలకు స్వగ్రామంలో వదిలివెళ్లారు. ఇంటికొచ్చిన బాలికను తల్లిదండ్రులు రాత్రంతా ఎక్కడికి వెళ్లావని గట్టిగా అడగడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ద్విచక్ర వాహనాల
దొంగ అరెస్ట్
సిద్దిపేటకమాన్: వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. సిద్దిపేట శ్రీనగర్ కాలనీకి చెందిన నరేశ్ ఈ నెల 10న తన ద్విచక్ర వాహనాన్ని పట్టణంలోని ఓ బార్ వద్ద పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సౌజన్య ఆధ్వర్యంలో ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు భూమలింగం, రాజిరెడ్డి బుధవారం స్థానిక ముస్తాబాద్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన వల్లేపు నవీన్ (40) పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నట్లు నేరం ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు.


