ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు వివరాలు ఇలా..
అతివేగానికి యువకుడు..
చిలప్‌చెడ్(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని గుజిరితండా శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ నర్సింహులు కథనం ప్రకారం.. హత్నూర మండలం, పీర్యాతండా పరిధిలోని దేవునిగుట్ట తండాకు చెందిన మెగావత్ రాహుల్ (22), తన స్నేహితుడైన లునావత్ ధన్‌రాజ్‌తో కలిసి చిలప్‌చెడ్ మండలంలో గల గౌతాపూర్ గ్రామానికి వెళ్తున్నారు. రాహుల్ అతివేగంతో బైక్ నడపుతున్న సమయంలో, గుజిరితండా శివారులోకి రాగానే బైక్ అదుపుతప్పడంతో, చెట్టును ఢీకొట్టాడు. దీంతో స్నేహితులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న తండ్రి లక్య, ఘటనా స్థలానికి వచ్చేసరికి రాహుల్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. గాయాలతో ఉన్న ధన్‌రాజ్‌ను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కారు ఢీకొట్టడంతో..
వట్పల్లి(అందోల్): నాందేడ్ –అకోలా జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన అందోల్ మండల పరిధిలోని అల్మాయిపేట వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాయిని శ్రీకాంత్(25) తన బైక్‌పై చౌటకూర్ వైపు నుంచి వస్తూ అల్మాయిపేట దర్గా వద్ద యూటర్న్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అందోల్ మండలం ఎర్రారం గ్రామానికి చెందిన చాకలి కరుణాకర్‌కు చెందిన షిఫ్ట్ కారు సంగారెడ్డి వైపు వెళ్తూ బైక్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ రోడ్డు కిందకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


