సదాశివపేట రూరల్(సంగారెడ్డి): క్వారీ గుంతలో మునిగి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మలపాడ్ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామాని కి చెందిన మన్నే నర్సింలు(32) ఈనెల 19న మరో వ్యక్తితో కలిసి గ్రామ శివారులోని క్వారీ గుంతలో చేపల వేటకు వెళ్లాడు. మృతుడికి ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి మునిగిపోయాడు. మృతదేహం నీటిలో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ యువకుడు..
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కథనం ప్రకారం.. చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎల్లారం రాజు(50) మేసీ్త్ర పనులు చేస్తాడు. ఆదివారం సాయంత్రం పనులు ముగిసిన తరువాత తనతో వచ్చిన కూలీలను చందంపేటలో దించి వస్తుండగా రుద్రారం సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని వెంటనే లక్ష్మక్కపల్లిలోని ఎంవీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన రామచంద్రాపురం పట్టణంలోని ఇక్రిశాట్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 19న ఇక్రిశాట్ సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు 35 నుంచి 40ఏళ్లు ఉంటాయని, ఒంటిపై బూడిద రంగు జీన్స్ ప్యాంట్, లెల్ల రంగు చొక్క ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


