పాముకాటుతో బాలిక మృతి
సిద్దిపేటఅర్బన్: తెల్లవారితే అందరితో సరదాగా దసరా పండుగ జరుపుకోవాల్సిన బాలిక పాముకాటుకు గురై మృతి చెందింది. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంకటి నాగరాజు ర్యాపిడో డ్రైవర్‌గా పని చేసుకుంటూ భార్య లత, కుమార్తె శ్రీహిత(8)ను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఎప్పటిలాగే ఇంట్లో నేలపై నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చిన నాగుపాము శ్రీహిత చేయిపై కరవగా నొప్పి పెడుతుందని తల్లిదండ్రులకు చెప్పడంతో చేయికి బ్యాండేజ్ వేశారు. కొంత సేపటి తర్వాత తల తిరుగుతోందని, గాబరాగా ఉందని చెప్పింది. అదే సమయంలో తల్లి లతకు నాగుపాము కనిపించింది. పామును చంపి, బాలికను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు కావడంతో వారి రోదనలు మిన్నంటాయి.
చెరువులో పడి వృద్ధుడు..
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని అనంతసాగర్‌లో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మోడి నర్సయ్య(55) మూడేళ్లుగా మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో ఈ నెల 19న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి వరకు రాకపోవడంతో బంధువుల వద్ద, మిత్రుల వద్ద వెతికినా ఆచూకీ కనిపించలేదు. బుధవారం గ్రామ శివారులోని చెరువు వద్ద నీటిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన నర్సయ్య మృతదేహంగా గుర్తించారు.


