నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏఆర్ ఎస్‌ఐ నీలి ప్రసాద్ (57), చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు నర్సాపూర్ పోలీసులు సోమవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏఆర్ ఎస్‌ఐ నీలి ప్రసాద్ ఈ నెల 18న మెదక్ జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి పల్సర్ బైక్‌పై బయలుదేరారు. నర్సాపూర్– మెదక్ 765డి జాతీయ రహదారిలోని పెద్దచింతకుంట జలహనుమాన్ సమీపంలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆయన ఛాతీతో పాటు పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్‌లో నర్సాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కొండాపూర్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి ఆయన మృతి చెందారు. మృతుడి కుమారుడు నీలి శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


