కొల్చారం(నర్సాపూర్): ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ హైమద్ మోహినుద్దీన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్య (54) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన పొలానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందకపోవడంతో ఇటీవలే రెండు బోర్లు వేయించాడు. అయితే ఆ రెండు బోర్లు విఫలమయ్యాయి. అప్పటికే వివిధ అవసరాల కోసం ఆయన రూ. 3 లక్షల వరకు అప్పులు చేశాడు. పెట్టిన పెట్టుబడి నష్టపోవడం, పంట ఎండిపోవడం, చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ఇంటి పైకప్పు కట్టెకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


