సాక్షి, సిటీబ్యూరో: తెల్లాపూర్‌లోని త్రిపుర నిర్వాణ పేరుతో వెంచర్ వేసి, ప్రీలాంచ్ ఆఫర్ ఇచ్చి పలువురి నుంచి రూ.5.6 కోట్లు వసూలు చేసిన త్రిపుర కన్‌స్ట్రక్షన్ బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఈ సంస్థపై ఇప్పటికే ఓ కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా బయటకు వచ్చిన మరికొందరు బాధితులు బుధవారం సీసీఎస్ ఎదుట నిరసన తెలిపారు. తమను ముంచిన ఆ సంస్థ తెల్లాపూర్‌లోని భూమిని మరో సంస్థకు విక్రయించడానికి చూస్తోందని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన వారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు బీడీఎల్ మాజీ ఉద్యోగులు ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.76లో కార్యాలయం కలిగి ఉన్న త్రిపుర సంస్థ తెల్లాపూర్‌లో రెసిడెన్షియల్ హై–రైజ్ గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. గతంలో తమకు కస్టమర్లుగా ఉన్న వారిని మరోసారి సంప్రదించి.. ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేలా చేసింది. మరికొందరి నుంచి ప్రీ–లాంచ్ ఆఫర్ పేరుతో వసూలు చేసింది. ఇలా మోసపోయిన బాధితులు సంస్థ నిర్వాహకులు పసుపులేటి సుధాకర్‌పై ఫిర్యాదు చేశారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఫ్లాట్ల నిర్మాణం చేపట్టకుండా సంస్థ ప్రతినిధులు కాలయాపన చేస్తూ వచ్చారని బాధితులు ఆరోపించారు. తమకు చూపించిన వెంచర్‌లో కాకుండా మరోచోట ఇస్తామంటూ ఇప్పుడు అంటున్నారని మరికొందరు పేర్కొన్నారు. తమకు ఫ్లాట్లు నిర్మిస్తామని చెప్పి కొనుగోలు చేసిన భూమిని మరో రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 350 మంది నుంచి రూ.500 కోట్ల వరకు వసూలు చేశారని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి పసుపులేటి సుధాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని సీసీఎస్ పోలీసులను కోరారు.
త్రిపుర కన్‌స్ట్రక్షన్ బాధితుల ఆరోపణ
ప్రీలాంచ్ ఆఫర్, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ స్కామ్
ఆ భూమిని మరొకరికి అమ్ముతున్నారన్న బాధితులు


