ఫిష్ సీడ్ టెండర్ ప్రక్రియలో అవకతవకలు!
ఆరోపణల్లో వాస్తవం లేదు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఫిష్ సీడ్ (విత్తన చేప పిల్లల) టెండర్ ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రూ.3.71 కోట్లు విలువ చేసే సీడ్ కొనుగోళ్ల కోసం సరఫరాదారుల ఎంపికలో జిమ్మిక్కులు జరిగాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే కాంట్రాక్టర్ రెండు ఏజెన్సీల పేరుతో టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం. ఏజెన్సీల పేర్లు మార్చి మరికొన్ని జిల్లాల్లోనూ సరఫరా టెండర్‌ను కై వసం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిరుపేద మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏటా ఉచిత విత్తన చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం విధితమే. ఈ పథకం అమలు తీరు ఏటా తీవ్ర విమర్శలకు దారితీస్తున్న విషయం విధితమే. ఈ ఏడాది కూడా విత్తన చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
● జిల్లాలో సింగూరు, నల్లవాగు, మిలిగిరి ప్రాజెక్టు రిజర్వాయర్లతో పాటు, ఏడాదంతా నీరు ఉండే 79 చెరువుల్లో ఏటా విత్తన చేప పిల్లలను వదులుతారు. అలాగే వర్షాలు కురిస్తే నిండే 1,053 చెరువుల్లో 50 శాతం నీళ్లు నిండిన చెరువుల్లో కూడా విత్తన చేప పిల్లలను వదలాలని నిర్ణయించారు.
● ఇందుకోసం పెద్ద సైజు (80 మి.మీ – 100 మి.మీ) విత్తన చేపపిల్లలు 1.45 కోట్లు కొనుగోలు చేస్తున్నారు. అలాగే చిన్న విత్తన చేప పిల్లలు (35మి.మీ– 40మి.మీ పొడవు) 2.03 కోట్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మత్స్యశాఖ టెండర్ ప్రక్రియను చేపట్టింది. ఒక్కో పెద్ద చేప పిల్లకు రూ.1.45 చొప్పున, చిన్న సైజు చేప పిల్లకు 65 పైసల చొప్పున రేటును డిసైడ్ చేశారు.
● ఎప్పటిలాగే ఈసారి కూడా ఆంధ్రా ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. ఐదుగురు బిడ్డింగ్‌లో పాల్గొనగా.. నలుగురికి ఈ సరఫరా కాంట్రాక్టును అప్పగించారు. ఈ కాంట్రాక్టర్లు త్వరలో విత్తన చేప పిల్లలను చెరువుల్లో వదలనున్నారు. ఈ టెండర్ ప్రక్రియ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రికార్డు మేర సరఫరా ప్రశ్నార్థకమే
చెరువులు, రిజర్వాయర్లలో విత్తన చేప పిల్లలు వదిలే కార్యక్రమం రెండు, మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. రికార్డు ప్రకారం ఆయా చెరువుల్లో పోయనున్న విత్తన చేప పిల్లలు ఎన్ని.. పోసే చేప పిల్లలు ఎన్ని అనేది ప్రశ్నార్థకం. గతంలో వెయ్యి పిల్లలు వేయాల్సిన చెరువుల్లో కనీసం 40 శాతం కూడా పోయడం లేదు. కానీ రికార్డుల్లో మాత్రం పూర్తిగా పోసి బిల్లులు డ్రా చేశారు. ఈసారి చెరువుల్లో పోసే పిల్లల సంఖ్యపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మత్స్యశాఖ రాష్ట్ర కార్యాలయంలో పాతుకుపోయిన కీలక అధికారుల అండతో గతంలో పీఎం మత్స్యసంవృద్ధి యోజన నిధుల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చేతులు మారిన ముడుపులు?
నిబంధనల ప్రకారం టెండర్ వేసిన కాంట్రాక్టర్‌కు విత్తన చేప పిల్లల పెంపక కేంద్రం (ఫిష్ సీడ్ ఫాం) ఉందా.. ఎన్ని చేప పిల్లలు పెంచుతున్నారు.. వంటి అంశాలను పరిశీలించేందుకు అధికారులు సీడ్ ఫాం దగ్గరకు వెళ్లి ఇన్‌స్పెక్షన్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం నలుగురు అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే ఫాం ఇన్‌స్పెక్షన్ ప్రక్రియ తీరుపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అపోలో ఫిష్, రొయ్యల చెరువును విత్తన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలుగా రిపోర్టులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రూ.3.71 కోట్లతో విత్తన చేప పిల్లల కొనుగోళ్లు
ఫాం ఇన్‌స్పెక్షన్ తీరుపైనా ఆరోపణలు
సరఫరా టెండర్లు దక్కించుకున్న ఆంధ్రా కాంట్రాక్టర్లు
టెండర్ ప్రక్రియ అంతా సజావుగా జరిగింది. ఫిష్ సీడ్ ఫాం ఇన్‌స్పెక్షన్ ప్రక్రియ ప్రలోభ పెట్టారనే ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు. మేము స్వ యంగా వెళ్లి సీడ్ ఫాంలను పరిశీలించాం. ఆ ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ కాంట్రాక్టర్లు అనేక సంవత్సరాలుగా సీడ్‌ను సరఫరా చేస్తున్నారు. ముడుపులు చేతులు మారాయనే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు.
– పూర్ణిమ, అసిస్టెంట్ డైరెక్టర్, మత్స్యశాఖ


