సంగారెడ్డి జోన్/సంగారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. వచ్చే నెల 9న ఎన్నికలు జరుగుతుండటంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. సుమారు ఎనిమిదేళ్ల అనంతరం ఆర్టీసీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల ప్రచార కార్యక్రమం జోరందుకుంది. గత కొన్నేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఉద్యోగులు ఎన్నికల నిర్వహణతోపాటు ప్రధాన డిమాండ్‌లు పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. అయితే ఈ నెల 19న ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
గుర్తుల కేటాయింపుతో ప్రచారం జోష్
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యూనియన్లు పావులు కదుపుతున్నాయి. బతుకమ్మ, నిచ్చెన, కత్తెర, బస్సు, టైరు, విల్లుబాణం, కాగడా, పులి, గదా వంటి విభిన్న గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయించారు. ఈనెల 26న ఎన్నికల గుర్తులు కేటాయించడంతో ప్రచారంలో జోష్ పెరిగింది. మెదక్ రీజియన్ పరిధిలో 9 డిపోలతో పాటు ఒక రీజనల్ కార్యాలయం ఉంది. ఆయా కార్యాలయాల్లో 1,299 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ ఓటర్లుగా ఉన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికే ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసి, ఈనెల 25 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. వాటిని పరిష్కరించి త్వరలో తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. తా జాగా మంగళవారం నమూనా బ్యాలెట్ పత్రాలను విడుదల చేశారు. నేటి నుంచి బ్యాలెట్ పత్రాలతో ప్రచార కార్యక్రమం మరింత జోరుగా సాగే అవకాశాలున్నాయి.
మూడు యూనియన్ల మధ్య తీవ్ర పోటీ
ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో 12 యూనియన్లు బరిలో ఉన్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా మలుచుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ, బకాయి ఉన్న పే రివిజన్, అలవెన్సుల చెల్లింపు, ఉద్యోగుల కొరతను అధిగమించడం, పనిభారాన్ని తగ్గించడం తదితర డిమాండ్లు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే యూనియన్లు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. ప్రధానంగా టీజేఎంయూ, టీడబ్ల్యూయు, ఈయూ యూనియన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ప్రతీ కార్మికుడికి రెండు ఓట్లు
ఆర్టీసీ ఎన్నికల్లో ప్రతీ ఒక్క కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ఒక ఓటు, మరొకటి రీజినల్ స్థాయిలో వేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 9న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. 14, 15న పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించి, 17న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఆర్టీసీ సమస్యల పరిష్కారమే ఎజెండాగా ప్రచారం
నమూనా బ్యాలెట్ జారీ చేసిన అధికారులు
త్వరలో ప్రకటించనున్న తుది ఓటరు జాబితా
రాష్ట్ర, రీజియన్ స్థాయిలకుఓటు వేయనున్న కార్మికులు
విలీనం వద్దన్న వారికి ఓటేద్దామా?
సంగారెడ్డి టౌన్: ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పట్టణంలోని టీజేఎంయూ యూనియన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి టీజేఎంయూ రాష్ట్ర కార్యదర్శి హనుమంతు, మాజీ టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇతర యూనియన్ నాయకులు ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. అనంతరం పలువురు నాయకులు టీజేఎంయూ యూనియన్‌లో చేరారు.


