హత్నూర(సంగారెడ్డి): నిరుపేదలకు ప్రభుత్వమిచ్చిన అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్తున్నాయి. అందులో దర్జాగా ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. అయినా అటువైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హత్నూర మండలం కోడిపాక శివారులో దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు 123 సర్వే నంబర్‌లో సుమారు 75 ఎకరాల అసైన్డ్ భూములు కేటాయించింది. వాటిని యజమానులు లీజుల పేరుతో విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సుమారు 50 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు చేతులు మారినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో గ్రామం ఉండటంతో ఆ భూములపై కన్నేసిన బడాబాబులు ఎకరా, ఆపై అసైన్డ్ భూమిని కొనుగోలు చేసుకొని అందులో ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. అసైన్డ్ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దనే నిబంధన ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో దర్జాగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. కాగా, ఆ అక్రమ నిర్మాణాలకు విద్యుత్ శాఖ కనెక్షన్లు ఇస్తూ మీటర్లు సైతం బిగించడం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు చేస్తున్న బడాబాబులపై చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రేండ్లగూడ, ఎల్లమ్మ గూడ, వడ్డేపల్లి, కాసాల, హత్నూర గ్రామాల శివారులలోని అసైన్డ్ భూములు జోరుగా క్రయవిక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోడిపాక శివారులో సుమారు 50 ఎకరాలు కొనుగోలు
ఆ భూముల్లో బడాబాబుల ఫాంహౌస్‌ల నిర్మాణం
అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు
విచారణ చేపడతాం
అసైన్డ్ భూములు విక్రయించినా, కొనుగోలు చేసినా చర్యలు తప్పవు. కొడిపాకలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసి అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ఆ భూములను కొనుగోలు చేయడం నేరం. క్షేత్రస్థాయిలో విచారణ చేపడతాం. – రాజేందర్ ఆర్డీఓ, సంగారెడ్డి


