వర్గల్(గజ్వేల్): హరిద్రానది తీరాన సహజసిద్ధ కొండ గుహల్లో లక్ష్మీ నృసింహస్వామివారు వెలసిన భవ్య క్షేత్రం నాచగిరి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టలోని ఈ క్షేత్రం రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరొందింది. దాదాపు 5వేల ఏళ్ల నుంచి స్వామివారు పూజలందుకుంటున్నట్లు ప్రతీతి. ఇక్కడ రామాలయం, శివాలయం, సత్యనారాయణ స్వామి ఆలయం, దత్తాత్రేయ మందిర, నవగ్రహాలయాలున్నాయి. ఏటా 5లక్షల భక్తులు సందర్శిస్తారు.
హైదరాబాద్‌కు సమీపంలో..
హైదరాబాద్‌కు 55 కిలోమీటర్ల దూరంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై నాచగిరి క్షేత్రం ఉంది. జహీరాబాద్, సంగారెడ్డి నుంచి గజ్వేల్, భువనగిరి, యాదగిరిగుట్టకు వెళ్లే బస్సులు నాచగిరి మీదుగా వెళ్తాయి. సికిందరాబాద్ నుంచి వచ్చే యాత్రికులు తూప్రాన్ వద్ద దిగి అక్కడి నుంచి బస్సులో చేరుకోవచ్చు.


