● ఉలిక్కిపడ్డ గ్రామాలు ● మహ్మద్‌షాపూర్‌లో పాదముద్రల గుర్తింపు
దుబ్బాకటౌన్: దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపించడంతో గొడుగుపల్లి, మహ్మద్‌షాపూర్, కోనాపూర్, తిరుమలాపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. శనివారం మహ్మద్‌షాపూర్ గ్రామ సమీపంలో చిరుతపులి పాదముద్రలను గ్రామస్తులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ సెక్షన్‌న్ ఆఫీసర్ కరీముద్దీన్‌న్ ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుత సంచారంపై గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతం వైపు ఒంటరిగా వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి జాగ్రత్తగా ఉండాలన్నారు. చిరుత సాధారణంగా ఒకే ప్రాంతంలో ఉండదని, ఎక్కడైనా చిరుత కనిపించినా దాని వెంటపడటం, దగ్గరకు వెళ్లడం చేయవద్దని చెప్పారు. పరిశీలించిన వారిలో బీట్ ఆఫీసర్ జహంగీర్, గ్రామస్తులు ఉన్నారు.


