చిన్నశంకరంపేట(మెదక్): మండల పరిధి చందంపేటలో పాపన్నపేట సంస్థాన రాణి చందమ్మ హయాంలో నిర్మించిన కోటదుర్గం చరిత్రను చాటిచెబుతూ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. మెదక్–చేగుంట ప్రధాన రహదారికి పొలంపల్లి నుంచి కిలోమీటరు దూరం, చిన్నశంకరంపేట మండల కంద్రం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొదటిసారిగా ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాపన్నపేట సంస్థాన రాజ్యవంశంలో 1,395 నుంచి 1,422 మధ్య కాలంలో రాణి చందమ్మ ఏకఛత్రాధిపత్యంలో రాజ్యవిస్తరణకు నడుంబిగించిన కాలంలో నిర్మాణం జరుపుకొన్న కట్టడమే చందంపేట కోటదుర్గం. నిజాం నవాబుల కాలంలోనూ స్వతంత్ర సంస్థానంగా వెలుగోందిన పాపన్నపేట సంస్థాన రాణుల్లో చందమ్మ ఒకరు. శత్రుదుర్భేద్యమైన ఈ కోటలో విడిదిచేసి చందమ్మ మహరాణి వేటను కొనసాగించేవారని చెబుతుంటారు. అందుకే ఈ గ్రామానికి ఆమె పేరుతో వెలసిందని కూడా చరిత్రకారులు చెబుతున్నారు.


