సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టిన మైనింగ్ మాఫియాకు గనుల శాఖలోని కొందరు అండగా నిలుస్తున్నారా..? ఇటీవల ఈటీఎస్ సర్వే నిర్వహించిన క్వారీల్లో తవ్వుకెళ్లిన మినరల్ పరిమాణాన్ని తక్కువ చూపి.. ఓవర్ బర్డెన్.. మట్టి.. మొరం పరిమాణాన్ని ఎక్కువ చూపుతున్నారా? తద్వారా అక్రమార్కులకు పెనాల్టీ తక్కువ పడేలా చేతివాటం ప్రదర్శిస్తున్నారా.? అవుననే ఆరోపణలే వ్యక్తమవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు సమీపంలో ఉన్న స్టోన్‌మెటల్ క్వారీలపై ఇటీవల రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ఇప్పటికే జిల్లాలోని ఖాజీపల్లి, లక్డారంలలో ఉన్న 14 స్టోన్ అండ్ మెటల్ క్వారీల్లో ఈటీఎస్ సర్వే చేపట్టింది. ఆయా క్వారీల్లో పెద్ద ఎత్తున ఖనిజ సంపద కొల్లగొట్టినట్లు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ సర్వేలో తేలింది. తవ్వుకెళ్లిన ఖనిజ సంపద పరిమాణానికి గనులశాఖకు చెల్లించిన సీనరేజీకి రూ.కోట్లలో తేడాలు ఉన్నట్లు నిర్దారణకు వచ్చారు. సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులకు ఏమాత్రం తీసి పోని విధంగా వందల మీటర్ల లోతులో భూగర్భాన్ని తొలిచేసి క్వారీలను చూసి విజిలెన్స్ అధికారులే విస్తుపోయారంటే.. వీరు చేసిన దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
నివేదికల్లో చేతివాటం..?
ఈటీఎస్ సర్వే నివేదికలను పరిశీలించి.. ఆయా క్వారీల్లో తవ్విన ఖనిజం పరిమాణం ఎంత..? ఆ ఖనిజానికి సంబంధించి తమ శాఖకు జమ అయిన సీనరేజీ ఎంత..? తవ్విన గుంతను బట్టి ఎంత సీనరేజీ ఎగవేశారు.. అనే దానిపై భూగర్భ గనులశాఖ అధికారులు లెక్కలు వేసి రిపోర్టు ఇస్తారు. ఈ రిపోర్టు ఆధారంగా ఎగవేసిన ఎగవేసిన సీనరేజీ, దానిపై పెనాల్టీ కలిపి క్వారీ యజమానులకు డిమాండ్ నోటీసులు జారీ అవుతాయి. ఈ రిపోర్టుల్లో కొందరు మాయ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెనాల్టీలు తక్కువ పడేలా మట్టి, మొరం వంటి ఓవర్ బర్డెన్‌ను ఎక్కువ చూపి.. ఖనిజం పరిమాణాన్ని తక్కువ చూపుతున్నట్లు సమాచారం. ఈ డిమాండ్ నోటీసులపై అక్రమార్కులు కోర్టును ఆశ్రయించడం జిల్లాలో పరిపాటిగా తయారైంది. నేరం రుజువు కాకుండా.. కోర్టు కొట్టివేసేలా లోప భూయిష్టంగా ఈ నివేదికలు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతేడాది క్రితం ఇలాగే 15 క్వారీలపై విచారణ చేపట్టి గనుల శాఖకు ఎగవేసిన సీనరేజీకి సంబంధించి సుమారు రూ. 974 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీసులు జారీ చేయగా, వీరిలో చాలా మంది కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
ఓబీ ఎక్కువ చూపి అక్రమార్కులకు పెనాల్టీ తగ్గేలా జిమ్మిక్కులు
క్వారీల్లో కొనసాగుతున్న విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ
14 స్టోన్– మెటల్ క్వారీల్లో ఈటీఎస్ సర్వే పూర్తి
ఫీల్డ్‌కు వెళ్లను..
నాకు తెలియదు
నేను ఫీల్డ్‌కు వెళ్లను.. నాకు తెలియదు.. ఫీల్డ్ ఆఫీసర్లు వెళ్లి నివేదికలు ఇస్తుంటారు. తవ్విన ఖనిజం పరిమాణం తక్కువ చూపితే గుంత అబద్దం చెప్పదు కదా.. ఈటీఎస్ సర్వే నివేదికలను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అందజేస్తున్నాం. విచారణలో ఉన్నందున ఈ వివరాలు చెప్పడం కుదరదు. లేదంటే ఆ విభాగాన్నే సంప్రదించండి.
– విజయ్‌కుమార్,
భూగర్భ గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్


