నారాయణఖేడ్: సమాజంలోని ప్రతీ ఒక్కరికి సమాన హక్కులు, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవితం పొందేహక్కు ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సౌజన్య అన్నారు. ఖేడ్‌లోని ఐకేపీ భవన్‌లో సోమవారం దివ్యాంగుల కోసం న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్జి హాజరై మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల చట్టంలోని ముఖ్యమైన నిబంధనలను వివరిస్తూ విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక భద్రత, ప్రజా ప్రదేశాలు, ప్రభుత్వ సేవలను సమానంగా పొందే హక్కు ఉందన్నారు. అర్హత కలిగిన వారికి సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆమె వెంట ఖేడ్ సీడీపీఓ సుజాత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మారుతిరెడ్డి, దివ్యాంగుల సంఘం నాయకులు బస్వరాజ్, దివ్యాంగులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్‌లో జరిగే అండర్–14 టోర్నమెంట్ కోసం ఉమ్మడి మెదక్ జిల్లా బాలుర జట్టు ఎంపికలు చేపడుతున్నారు. ఈనెల 23న సంగారెడ్డిలోని ఎంఎస్ క్రికెట్ అకాడమీలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. క్రీడాకారులు పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఆధార్, బోనాఫైడ్, రెండు ఫొటోలతో సకాలంలో హాజరు కావాలని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి సూచించారు.
జిల్లా ఉద్యాన అధికారి సోమేశ్వరరావు
వట్‌పల్లి(అందోల్): ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులు అధిక లాభాల పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సోమేశ్వరరావు అన్నారు. సోమవారం ఆందోల్ మండలంలోని నేరడిగుంటలో నిమ్మ, జామ, కూరగాయలు, పూల తోటలను సందర్శించారు. సాగులో పాటించాల్సిన మెలకువలు, పంటల యాజమాన్య పద్ధతులు, దిగుబడి పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు సలహాలు, సూచనలు అందించారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌లో భాగంగా ప్యాక్‌హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.40 లక్షల వరకు, 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు కలిగిన ఫార్మ్ పాండ్ నిర్మాణానికి రూ.90 వేల వరకు రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా పూల తోటలు సా గు చేస్తున్న రైతులకు కూడా ప్రభుత్వం ఎకరాకు రూ.8 వేల రాయితీ అందిస్తున్నట్లు చెప్పారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఉద్యాన అధి కారి సమత, హెచ్‌ఈఓ సంగయ్య స్వామి, రైతులు వెంకటేశం, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్: పాఠశాల, కళాశాల సమయాలకు అనుగుణంగా స్పెషల్ బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ మనూరు మండలం బెల్లాపూర్ క్రాస్ రోడ్డు వద్ద విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా మండలంలోని బెల్లాపూర్, పుల్‌కుర్తి, బాదల్‌గాం, దోసపల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు మాట్లాడుతూ.. ఉదయం, సాయంత్రం వేళల్లో పుల్‌కుర్తి వరకు విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు నడపాలని కోరారు. బస్సు సర్వీసులు లేక పోవడంతో నిత్యం పాఠశాల, కళాశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. మనూరు ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చచెప్పారు. ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బస్సులు నడపాలని సూచించగా, అందుకు వారు సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.


