తండాలకు దారేదీ..? | - | Sakshi
Sakshi News home page

తండాలకు దారేదీ..?

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

బిల్లులు రావనే భయం

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గిరిజన తండాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2023లో జిల్లాకు రూ.21 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పలు గిరిజన తండాలను అనుసంధానిస్తూ మొత్తం 10 రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న ఫార్మేషన్‌ రోడ్లను బీటీగా మార్చాలని భావిస్తున్నారు. అయితే ఈ నిధులు మంజూరై దాదాపు మూడేళ్లు గడుస్తున్నప్పటికీ రోడ్ల నిర్మాణాల పనులు మాత్రం ఇంకా పట్టాలెక్కడం లేదు. పదింటిలో ఏడు రోడ్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. కేవలం మూడు రోడ్లు పనులు ప్రారంభమైనప్పటికీ.. ముందుకు సాగడం లేదు. ఒక రోడ్డు మెటల్‌ పనులకే పరిమితమైంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వస్తే చాలు వీరి ప్రయాణ కష్టాలు రెట్టింపు అవుతున్నాయి.

నాలుగు రోడ్లకు నో రెస్పాన్స్‌..

● ఈ పనులకు రోడ్లు భవనాల శాఖ అధికారులు టెండర్లు పిలిచారు. అయితే నాలుగు రోడ్లకు ఒక్క కాంట్రాక్టర్‌ కూడా బిడ్లు దాఖలు చేయలేదు. ఇప్పటివరకు మూడ పర్యాయాలు నోటిఫికేషన్‌ జారీ చేసినా గుత్తేదార్ల నుంచి స్పందన లేదు.

● మరో మూడింటికి గుత్తేదార్లు ముందుకు వచ్చినప్పటికీ, పనులు మాత్రం ప్రారంభించలేదు. వర్క్‌ అగ్రిమెంట్‌ చేసుకొని మూడేళ్లవుతున్నా పనులు చేయడం లేదు. దీంతో వీరిని టర్మినేట్‌ చేసి, మరో సారి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు.

● ఫార్మేషన్‌తో పాటు, మెటల్‌ పనులు చేసిన కాంట్రాక్టర్లు బీటీ వేసేందుకు ముందుకు రావడం లేదు. ఫార్మేషన్‌తో పాటు, మెటల్‌ మట్టుకు పనులు చేస్తే కొంత కలిసొస్తుంది. అదే బీటీ పనులు పూర్తి చేయాలంటే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అయితే కలిసొచ్చే ఫార్మేషన్‌, మెటల్‌ పనులు చేసిన గుత్తేదార్లు బీటీ పనులు చేయకుండా చేతులెత్తేశారు.

● ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే అత్యధికంగా నారాయణఖేడ్‌ సబ్‌ డివిజన్‌లోని తండాలకు మేలు జరుగుతుంది. రాంసింగ్‌ తండా, కిషన్‌నాయక్‌ తండా వంటి తండాలు ఉన్నాయి. అలాగే ఆందోల్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలు తండాలకు కూడా మెరుగైన రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

గుత్తేదార్లు పనులు చేసేందుకు ముందుకు రాకపోవడానికి ప్రధానంగా బిల్లులు రావనే భయం పట్టుకుంది. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో టెండర్లు వేసేందుకు జంకుతున్నారు. దీంతో ఈ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు మాత్రం పట్టాలెక్కడం లేదు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను టర్మినేట్‌ చేస్తామని ఆర్‌అండ్‌బి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఆ పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు.

గిరిజన ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి రూ.21 కోట్లు

మూడేళ్ల కిత్రం నిధులు మంజూరు

పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

టెండర్లు వేసిన వారు కూడా చేతులెత్తేస్తున్న వైనం

ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులతో చేపట్టిన రహదారుల తీరు ఇది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement