హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు పనులు ప్రారంభించకుంటే రద్దుచేసి కొత్తవారికి మంజూరు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి స్పష్టం చేశారు. హత్నూర మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో మండల అభివృద్ధిపై మంగళవారం జరిగిన సమీక్షలో డీపీఓ మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ పేదలు ఇళ్ల్లు నిర్మించుకోవడానికి ముందుకు రాకపోతే వెంటనే వాటిని రద్దుచేసి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. అన్ని గ్రామాల ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శిపై ఉందని స్పష్టం చేశారు. లీకేజీలు, బోరు మోటర్ల మరమ్మతులు, ట్యాంకర్ల మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని గ్రామ కార్యదర్శిలకు సూచించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ కవర్లు కనిపించకుండా చూడడంతోపాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లేకుంటే కార్యదర్శులపై వేటు తప్పదని హెచ్చరించారు. మహిళా సంఘాల భవనాల నిర్మాణాల పూర్తయ్యేలా నాయ కులు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను డీఎల్‌పీఓ అనిత, ఎంపీడీవో శంకర్, ఎంపీఈఓ యూసుఫ్, ఎంఈఓ వెంకట నరసింహగౌడ్‌తో కలసి సందర్శించారు. భోజన నాణ్యతతోపాటు సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కార్యదర్శులపై వేటు తప్పదు
జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి


