రైతులకు తీపికబురు | - | Sakshi
Sakshi News home page

రైతులకు తీపికబురు

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

రైతుల మేలు కోసమే

యాప్‌లో కీలక మార్పులు

రెండెకరాలకు ఒకేసారి యూరియా

ఐదెకరాల వరకు రెండు విడతల్లో బుకింగ్‌

సదాశివపేటరూరల్‌(సంగారెడ్డి): సబ్సిడీ యూరియా పంపిణీని మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం యూరియా బుకింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. గత వానాకాలం నుంచి యారియా కొరత రావడంతో ప్రత్యేక యాప్‌ తీసుకొచ్చారు. ప్రస్తుత వానాకాలం ఆరంభం నుంచి ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున విడతల వారీగా ఎరువు అందించే విధానానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ విధానంలో ఎక్కువ భూమి కలిగిన రైతులకు ఇబ్బందులు వస్తున్నాయనే ఫిర్యాదులతో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. దీంతో చిన్న, సన్నకారు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో 7.33 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది.

కొత్త విధానంలో బుకింగ్‌ ఇలా..

రైతుల భూ విస్తీర్ణాన్ని బట్టి యూరియా బుకింగ్‌ చేసుకునేలా దశలవారీ విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో మూడు విడతలుగా (15 రోజుల వ్యవధిలో) బుకింగ్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై రెండెకరాల పట్టా ఉన్న రైతులు ఒకేసారి పూర్తి పరిమాణం (నాలుగు బస్తాలు) బుకింగ్‌ చేసుకొని యూరియా తీసుకోవచ్చు. రెండు ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న వారు రెండు విడతల్లో (50–50 శాతం) బుకింగ్‌ను చేసుకోవాలి. ఇక ఐదు ఎకరాలకు పైబడి భూమి కలిగి ఉంటే మూడు విడతలుగా(40, 30, 30) బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య 20 రోజుల సమయం ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్పుల వల్ల రైతులకు యూరియా సకాలంలో అందడమే కాకుండా, సాగు ప్రణాళికలు రూపొందించుకోవడానికి వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా స్మార్ట్‌ఫోన్‌ లేదా యాప్‌ వాడకం రాని రైతుల కోసం ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల మేలు కోసం యూరియా బుకింగ్‌ యాప్‌ లో రూల్స్‌ ను మార్పులు,చేర్పులు చేయడం జరిగింది.ఈ నిబంధన మార్పుతో రైతులకు సకాలంలో ఎరువులు అందుతాయి.ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

– శివప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement