దుబ్బాకటౌన్: తోటి కార్మికుడిపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై అరుణ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లి గ్రామంలో బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బిల్డింగ్ కాంట్రాక్టర్ మల్లెల కృప వద్ద ఏపీకి చెందిన కోర్నాల్, మధ్యప్రదేశ్‌కు చెందిన అమృత్ లాల్ లేబర్ పనిచేస్తున్నారు. కొంతకాలంగా కోర్నాల్, అమృత్‌లాల్‌ను ఆట పట్టించేవాడు. ఆదివారం సాయంత్రం సైతం ముఖానికి సిమెంట్ రాయడం, అంగి పట్టుకొని లాగడం వంటి చర్యలకు పాల్పడినట్లు తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనను అవమానంగా భావించిన అమృత్ లాల్ కోపోద్రిక్తుడై అక్కడే ఉన్న పారతో, కోర్నాల్ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే సహచరులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడు కోమాలోకి వెళ్లాడని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు అమృత్ లాల్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.


