సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): ముంబై జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. ఈ సంఘటన సదాశివపేట మండలంలోని నందికంది శివారులో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు... సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న కారులో నందికంది శివారు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించి కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందకు దిగి పరుగులు తీశారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో అందరూ చూస్తుండగానే కారు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


