ఫ్రిజ్ పేలి.. ఇల్లు దగ్ధం
నర్సాపూర్ రూరల్: ఫ్రిజ్ పేలి రేకుల ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని గొల్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సారా సంతోష ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో ఫ్రిడ్జ్ పేలింది. దీంతో ఇంట్లోని బీరువాలో ఉన్న నగదు, బంగారం, బట్టలు నిత్యావసర సరుకులు కాలిపోయాయి. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే ఏ ఒక్క వస్తువు చేతికి రాకుండా బూడిదయ్యాయి. సంతోష భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితురాలు కోరారు.
బాన్సువాడలో గడ్డివాముకు..
కంగ్టి(నారాయణఖేడ్): ప్రమాదవశాత్తు గడ్డివాములు, పెంటకుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన మండలంలోని బాన్సువాడ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. జబ్బ రాములుకు చెందిన గడ్డివాములు, పెంటకుప్పలు మంటలో కాలి బూడిదయ్యాయి. గ్రామం మధ్యలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఎవరికి వారు ఇళ్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఆలస్యంగా వచ్చి ఆర్పారు. ఈ ప్రమాదంలో పశుగ్రాసం, సేంద్రియ ఎరువు దాదాపు రూ.40వేలకు పైగా కాలిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని కోరారు.


