చిరుధాన్యాల జాతర
సొంత విత్తనాలే..
నేటి నుంచి నెలరోజులపాటు కార్యక్రమం ఎడ్ల బండ్లలో విత్తనాల ప్రదర్శన
జహీరాబాద్: చిరుధాన్యాల ప్రాధాన్యతను నెలరోజులపాటు చాటిచెప్పే 26వ పాత పంటల జాతర బుధవారం నుంచి జహీరాబాద్ మండలంలోని జమలైతండాలో ప్రారంభం కానుంది. మండలంలోని పస్తాపూర్ గ్రామంలో గల డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల గుండా ఎడ్ల బండ్ల ద్వారా చిరు ధాన్యాలను ప్రదర్శిస్తూ జాతర కొనసాగుతుంది. వచ్చేనెల 13న ఝరాసంగం మండలంలోని మాచ్‌నూర్ గ్రామంలో ముగింపు జాతర నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతర నిర్వాహకులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.
సాగుపై అవగాహన
ఈ సందర్భంగా చిరు ధాన్యాల సాగు ప్రాధాన్యత, వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు చిరు ధాన్యాల ఆవశ్యకత, సేంద్రీయ సాగు, పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు నిర్వాహకులు సలహాలు, సూచనలు అందిస్తారు. ఇందుకోసం ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం రోజున పాత పంటల జాతర ప్రారంభిస్తున్నారు. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్, మొగుడంపల్లి మండలాల్లోని 70 గ్రామాల్లో డీడీఎస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సంఘంలోని మహిళలతోపాటు ఇతర రైతులకు చిరుధాన్యాల సంరక్షణ, పంటలను సాగు చేసే విధానం, విత్తనాల ఎంపిక, తదితర వాటిపై అవగాహన కల్పించేందుకుగాను డీడీఎస్ ఆధ్వర్యంలో జాతరను నిర్వహించనున్నారు.
మాచ్‌నూర్‌లో విత్తన బ్యాంకు
ఝరాసంగం మండలంలోని మాచ్‌నూర్ గ్రామంలో డీడీఎస్ ఆధ్వర్యంలో చిరు ధాన్యాల విత్తన బ్యాంకును నిర్వహిస్తున్నారు. రైతు తమ పొలంలో పండించిన పంటలో నాణ్యమైన వాటిని ఎంపిక చేసుకుని విత్తనంగా సేకరించి నిల్వ చేస్తారు. వాటిని వానాకాలం, యాసంగిలో సాగుకు ఉపయోగించుకుంటారు. విత్తన బ్యాంకులో రైతులు తీసుకున్న విత్తనాలను పంట వచ్చాక తిరిగి రెట్టింపు విత్తనంగా అందజేస్తారు. విత్తన బ్యాంకులో 50 నుంచి 60 రకాల వరకు విత్తనాలు నిల్వచేసి అందుబాటులో ఉంచుతారు. ప్రధానంగా సజ్జ, కొర్ర, సామ, పలు రకాల జొన్నలు, కందులు, మినుములు, అనుములు, పెసర, శనగ, ఉలవలు, తైదలతోపాటు పలు చిరు ధాన్యాల విత్తనాలను సేకరించి ఉంచుతారు.
ప్రభుత్వం అందించే విత్తనాల కోసం ఎదురు చూడకుండా తమ వద్ద పండించిన చిరుధాన్యాల పంటలను నుంచే రైతులు విత్తనాన్ని ఎంపిక చేసుకుంటారు. అవి పురుగు పట్టకుండా ఉండేందుకుగాను బూడిద, వేపాకు కలిపి ఈత బుట్టల్లో పోలిమట్టితో మూసి వేస్తారు. విత్తనాలు పెట్టే సమయంలో వాటిని బయటకు తీసి విత్తుతారు. రైతులు తమ వద్ద 40 నుంచి 60 రకాల వరకు చిరుధాన్యాల విత్తనాలు నిల్వచేసి పెట్టుకుంటారు.
చిరుధాన్యాల జాతర


