సచ్చినా.. బతికారట..!
పదేళ్ల కింద చనిపోయినా..
వారి పేర్లను గుర్తిస్తాం
ఓటరు జాబితాలో మృతుల పేర్లు
జోగిపేట(అందోల్): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తయారుచేసిన జోగిపేట–అందోలు మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల తడకగా తయారైంది. 20 వార్డుల్లో అన్నింటిలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు అందర్నీ విస్మయానికి గురిచేయడమే కాకుండా ఓటరు జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఓటర్ల జాబితాలో మృతులు, పట్టణాలకు వలస వెళ్లిన వారు, గ్రామాల్లో ఉండి పట్టణ జాబితాలో కూడా ఓటరుగా నమోదు కావడం, ఒక వార్డుకు సంబంధించి స్థానికుల పేర్లు మరో వార్డులో నమోదుకావడం, ఒకరికి బదులు మరొకరి ఫొటోలు, మరికొన్ని చోట్ల ఫొటోనే లేకపోవడం, సీ్త్ర ఓటరు పేరుతోపాటు వారి తండ్రి పేరు కూడా అదే పేరుతో అచ్చువేయించడం వంటి చిత్ర విచిత్రాలెన్నో జాబితాలో దర్శనమిస్తున్నాయి.
జాబితాలో తప్పులు ఇవే...
ఓటర్ల జాబితాలో ఈ తప్పులు దర్శనమిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో ఒక వార్డుకు చెందిన ఓటర్ల పేర్లు మరొక వార్డులో నమోదయ్యాయి. అలాగే ఓటరు జాబితాలో ఓటరు తల్లి, తండ్రి, భర్త పేరు వద్ద ఇంటి పేర్లు నమోదయ్యాయి. ఒక వార్డులో కుమారులు, సోదరుల ఓట్లు మరో వార్డులో చేర్చారు. ప్రతీ వార్డులో కనీసం 8 నుంచి 10 మంది మృతుల పేర్లు సమోదయ్యాయి. పలువురి ఇంటిపేరు, వార్డు పేరు సైతం ఓటరు జాబితాలో తప్పుగా నమోదయ్యాయి. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నప్పుడేనా?
బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో తప్పిదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన 4 రోజుల వ్యవధిలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరుగుతోంది. తప్పుల జాబితాపై ఏ ఒక్క అధికారి సైతం సమాధానం ఇవ్వడం లేదు.
ఎన్నికల కమిషన్ వారు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఓటరు జాబితాను పరిశీలిస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నా ఏకంగా ఐదు, పదేళ్ల కిందట చనిపోయిన వారి పేర్లు ఇంకా ప్రత్యక్షమవుతుండటం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఇటీవల ఓటర్ల జాబితాలో పట్టణంలోని 20 వార్డుల్లో మృతి చెందిన వారి వివరాలు ఓటర్ల జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. ఓటరు జాబితాలో దాదాపు వందమందికిపైగా చనిపోయిన వారి పేర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో పోటీ చేసే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాబితా విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ జాబితాలో కొందరు మృతుల పేర్లు నమోదైనట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మృతులకు సంబంధించి వివరాలను రెవెన్యూ అధికారులకు తెలియజేసి జాబితాలో చనిపోయినట్లు స్టాంప్ వేయిస్తాం. జోగిపేట– అందోలు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16,450 ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 8,564 కాగా పురుష ఓటర్లు 7,886గా వున్నారు.
–రవీందర్, కమిషనర్,
జోగిపేట మున్సిపాలిటీ
ప్రతీ వార్డులో కనీసం 8 నుంచి 10 మంది పేర్లు
ఒకరి ఫొటోకు బదులు మరొకరిది ప్రత్యక్షం
కొట్టొచ్చినట్లు కన్పిస్తోన్న అధికారుల అలసత్వం
తప్పుల తడకగా మున్సిపల్ జాబితా
సచ్చినా.. బతికారట..!


