పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడంలో పంచాయతీరాజ్ శాఖ అధికారుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొ న్నారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యో గుల సంఘం ఖేడ్ నియోజకవర్గ యూనిట్‌కు సంబంధించిన 2026 నూతన సంవత్సరం క్యాలెండర్లను ఆయన మంగళవారం ఖేడ్‌లోని తన నివాసగృహం ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అట్టడుగు గ్రామీణ ప్రజలకు సేవలందించడంలో పంచాయతీరాజ్ అధికారులు కీలకపాత్రను పోషిస్తున్నారన్నారు. అంకితభావంతో పనిచేస్తూ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు, నిజాంపేట ఎంపీడీఓ సంగ్రాం, జిల్లా నాయకులు ఇ.సుదర్శన్, ఇతర బాధ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్ధిక సహాయానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే తన నివాస గృహంలో అందజేశారు.
ధర్నాలో ఉల్లి రైతులు డిమాండ్
నారాయణఖేడ్: వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఖేడ్ నియోజకవర్గంలోని ఉల్లి రైతులు ఖేడ్ రాజీవ్ చౌక్, సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఉల్లి విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగినా గిట్టుబాటు ధర అందక తీవ్ర నష్టాలపాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాయితీపై విత్తనాలు, నిల్వకోసం గిడ్డంగులను నిర్మించి మద్దతు ధర క్వింటాలుకు రూ.720 ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు నేతృత్వం వహించిన బీఆర్‌ఎస్ నాయకులు, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మశ్చందర్ డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ ఉమాహారతికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: కార్మికుల సంక్షేమం ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బొల్లారం డివిజన్ పరిధిలోని రాణే డై కాస్టింగ్ పరిశ్రమలో రెండు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో కృష్ణసింగ్ అనే కార్మికుడు మృతి చెందాడు. మరణించిన కార్మికుడికి మెరుగైన నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే సూచించడంతో పరిశ్రమ యాజమాన్యం రూ.20 లక్షల నష్టపరిహారం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మృతుడి కుటుంబ సభ్యులకు నష్టపరిహారానికి సంబంధించిన రూ.15 లక్షల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. మరో రూ.ఐదు లక్షలు త్వరలో అందజేయనున్నట్లు యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ ప్రభాకర్
పటాన్‌చెరు టౌన్: రహదారి భద్రత మనందరి బాధ్యతని పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్డు భద్రత పై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘‘అరైవ్ అలైవ్ – సురక్షిత రహదారుల ప్రచార కార్యక్రమం మంగళవారం పటాన్‌చెరు మండలం క్యాసారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. గ్రామస్తులకు రోడ్డు భద్రతా నియమాలు, జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలకు గురైన కొంతమంది గ్రామస్తులు తమ అనుభవాలను పంచుకున్నారు. బీడీఎస్ సీఐ విజయకృష్ణ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీడీఎల్ పోలీసులు సిబ్బంది బాలచందర్, అలన్, సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం


