కోడ్ కూయక ముందే
రెండేళ్లూ ఏం చేశారు
● సంక్షేమ పథకాలపైనా ప్రత్యేక దృష్టి
● మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే యోచన
● రెండేళ్లుగా పట్టణాల అభివృద్ధి కుంటుపడిందంటున్న ప్రతిపక్షాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరికొద్దిరోజుల్లోనే ఎన్నికల నియమావళి (కోడ్) అమలులోకి వచ్చే అవకాశాలుండటంతో అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. హడావుడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేసేస్తోంది. ఈ పనులను ప్రారంభించడం ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు వార్డుల వారీగా తుది ఓటరు జాబితాలను ప్రకటించగా...కౌన్సిలర్లు, చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో అఽధికార కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులపై నజర్ వేసింది. అందుకే జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో శనివారం ఒక్కరోజే రూ.1.75 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేసింది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డైనేజీల పనులకు శ్రీకారం చుట్టగా..ఈ ప్రారంభభ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి పాల్గొన్నారు. ఇక సదాశివపేటలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి సీసీరోడ్లు, డ్రైనేజీలతోపాటు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కల్యాణలక్షి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మరోవైపు ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం సీసీరోడ్లు నిర్మాణం పనులను ప్రారంభించారు. కాగా, కౌన్సిలర్ రేసులో నిలవాలని భావిస్తున్న నాయకులు ఏకంగా తమ సొంత ఖర్చులతో బోర్లు వేయింస్తుండటం గమనార్హం.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. గత రెండేళ్లు మున్సిపాలిటీల అభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు రాగానే అభివృద్ధి పనుల పేరుతో హడావిడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెండేళ్లుగా పట్టణాల్లో అభివృద్ధి పనులు పడకేశాయని, కనీసం పారిశుద్ధ్య పనుల నిర్వహణలో కూడా విఫలమవుతున్నారని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. మొత్తం మీద బల్దియా ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది.


