భూ సేకరణ వేగవంతం చేయాలి
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న నిమ్జ్, ట్రిపుల్ ఆర్, టీజీఐఐసీ ప్రాజెక్టుల కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. భూసేకరణ పురోగతిపై కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, డీఎం అండ్ హెచ్‌ఓ వసంత్ రావు, ఆర్డీవో రాజేందర్, జిల్లా రవాణ అధికారి అరుణ, తదితరులు పాల్గొన్న ఈ సమీక్షలో భూ సేకరణకు సంబంధించి సమగ్రంగా చర్చించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
సమన్వయంతోనే ప్రమాదాల నివారణ
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే సాధ్యమవుతుందని ప్రావీణ్య తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి సమగ్ర ప్రణాళికతో నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. నేషనల్ హైవే–65లో గుర్తించిన జంక్షన్ల వద్ద సరిపడా లైటింగ్, సూచిక బోర్డులు, స్టడ్స్, బ్లింకర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్ద చెట్ల వల్ల లైటింగ్ స్పష్టంగా కనిపించని చోట్ల మున్సిపల్ కమిషనర్, డీపీఓ సహకారంతో రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని చెప్పారు. అంతకుముందు వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రావీణ్య వ్యవసాయ శాఖ డైరీ, గెజిటెడ్ అధికారుల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు శివ ప్రసాద్, లలిత కుమారి, వైద్యనాథ్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


