చిదిమేస్తున్న చైనా మాంజా
● నిషేధించినా కొనసాగుతున్న విక్రయాలు ● దానివైపే మొగ్గుచూపుతున్న యువత ● ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలు ● తనిఖీలు చేస్తున్న పోలీసులు
సంక్రాంతి అంటే ఆనందాలు తెచ్చే పండుగ. ఆరుగాలం కష్టించి పండించిన పంట ఇంటికి చేరగా.. గ్రామాల్లో అందరూ సంతోషంగా జరుపుకొనే సంబురాలకు ప్రతీక. కానీ ఈ మధ్య కాలంలో ఆ ఆనందానికి చైనా మాంజా చితిపెడుతోంది. పండుగ సందర్భంగా పతంగాలను ఎగురవేయడానికి వాడుతున్న ఆ మాంజా వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి.
జహీరాబాద్‌టౌన్/మెదక్‌జోన్: పతంగలు ఎగరేయడం తెలంగాణ సంప్రదాయం. కానీ చైనా మాంజా కారణంగా ప్రజలు, పక్షుల ప్రాణాలు పోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆ అమ్మకాలను నిషేధించింది. అయినా చైనా మాంజా అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తగంగా పతంగులు, మాంజా వ్యాపారం సుమారు రూ. కోటికిపైగా జరుగుతోందని అంచనా. ఈ మేరకు జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్ ఆదేశాల మేరకు జహీరాబాద్ టౌన్ సీఐ శివలింగం, ఎస్‌ఐ వినయ్‌కుమార్ పట్టణంలోని పతంగుల దుకాణాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇద్దరి వద్ద చైనా మాంజా లభించగా వారిపై కేసు నమోదు చేశారు. సాధారణ మాంజా విక్రయించాలని, చైనా మాంజా వద్దని వారు సూచిస్తున్నారు.
చైనామాంజా వల్లా కలిగే ప్రాణనష్టంతో పాటు పర్యావరణానికి ఏవిధంగా కీడు జరుగుతుందనే విషయాన్ని పోలీసులు ప్రజలకు వివరిస్తున్నారు. చైనా మాంజాను వాడొద్దని ప్రచారం చేస్తున్నారు. కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు మెదక్‌లో ఓ వ్యాపారితోపాటు నర్సాపూర్‌లో మరో ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారం రోజులుగా మెదక్‌తో పాటు ప్రతి పల్లెను జల్లెడ పడుతున్నారు.
తల్లిదండ్రులు జాగ్రత్త
పిల్లలు చైనా మాంజాతో పతంగులు ఎగురవేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. యువకులు కూడా దేశీరకాలనే కొనాలి. చైనా మాంజా వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యాపారులు కూడా చైనా మాంజాను విక్రహించవద్దు.
– వినయ్‌కుమార్, ఎస్‌ఐ జహీరాబాద్ టౌన్
చిదిమేస్తున్న చైనా మాంజా


